నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు 40 ఏండ్లుగా కంటున్న పసుపు బోర్డు కల ఎట్టకేలకు సాకారమైంది. పాలమూరు వేదికగా ప్రధాని మోదీ ఆదివారం తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.
బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన పసుపు రైతు ముత్యాల మనోహర్ రెడ్డి పసుపు బోర్డు వచ్చేదాకా చెప్పులు వేసుకోనని ప్రతినబూని తొమ్మిదేండ్ల నుంచి వట్టి కాళ్లతో తిరుగుతున్నారు. 2014లో బోర్డు కోసం రైతులతో కలిసి పాదయాత్ర చేసి వారి సమక్షంలో చెప్పులు తీసిపడేశారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో చెప్పులు లేకుండా పసుపు బోర్డు కోసం పాదయాత్ర చేశారు. ప్రధాని ప్రకటనతో ఆదివారం నిజామాబాద్ గంజ్‌లో మనోహర్‌రెడ్డి చెప్పులు ధరించారు.
జైలుకు వెళ్లిన ఫలితం దక్కింది
నాకిప్పుడు 54 ఏండ్లు. నేను 12 ఏండ్ల పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి పసుపు బోర్డు డిమాండ్ ఉంది. 2009 సంవత్సరం తర్వాత ఈ డిమాండ్ సాధనే లక్ష్యంగా ఉద్యమాలు చేసినం. అనేక మంది రైతులు జైళ్లపాలయ్యారు. బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంలో నాలుగు రోజులు నేను కూడా జైలుకు వెళ్లిన. బోర్డు ఏర్పాటు ప్రకటన సంతోషాన్నిచ్చింది. రైతుల ఉద్యమాలు వృథా కాలేదు.
-
నూతుల శ్రీనివాస్‌రెడ్డి, పసుపు రైతు