
- మెట్‌పల్లి మార్కెట్‌లో పసుపు రైతుల నిలువు దోపిడి
- వ్యాపారుల ఇష్టారాజ్యం.. వారు చెప్పిందే రేటు
- గతేడాది రూ.15వేలు పలకగా.. ఈసారి రూ.11వేలు దాటలే..
- నేడు మెట్‌పల్లిలో గిట్టుబాటు ధర కోసం పసుపు రైతుల మహాధర్నా
మెట్‌పల్లి, వెలుగు: నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అయినప్పటికీ పసుపునకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు మార్కెట్లలో రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. మెట్‌పల్లి పసుపు మార్కెట్‌లో వారు చెప్పిందే రేటు నడుస్తోంది. దీంతో పెట్టిన పెట్టుబడి రాక రైతులు లబోదిబోమంటున్నారు. ఈక్రమంలో విసిగివేసారిన రైతులు గిట్టుబాటు ధర కోసం నేడు మహాధర్నాకు సిద్ధమయ్యారు.
వ్యాపారులు చెప్పిందే రేటు
మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో పసుపు కొనుగోళ్లలో వ్యాపారులు చెప్పిందే రేటుగా నడుస్తోంది. ఈ మార్కెట్‌లో పసుపు కొనుగోలు చేసే వ్యాపారులు సుమారు 50 మంది వరకు ఉన్నారు. వీరిలో 8 నుంచి 10 మంది పెద్దవ్యాపారులు. ఇక్కడి కొనుగోళ్లు చాలావరకు వీరి కనుసన్నల్లోనే కొనుగోళ్లు జరుగుతాయన్న ప్రచారం ఉంది. వీరంతా సిండికేట్‌గా మారి రేట్ ఫిక్స్ చేస్తుంటారు. అందువల్లే పసుపునకు డిమాండ్ ఉన్నా మెట్‌పల్లి మార్కెట్‌లో ధర పెరగడం లేదన్న ఆరోపణలున్నాయి.
Also Read :- ఇసుక తరలించేందుకు..కృష్ణా నదిలో రోడ్డు !
వీరంతా లోకల్‌గా బలంగా ఉండడం వల్ల ఇతర ప్రాంతాల వ్యాపారులను ఇక్కడికి రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. గత వారంతో పోలిస్తే డిమాండ్ పెరిగింది. అయినప్పటికీ ధర పెరగలేదు. గత నెలలో క్వింటాకు రూ.11 వేలు లోపు ఉండగా.. ఇంకా రేటు తగ్గుతూనే ఉంది. పసుపులో నాణ్యత లేదని, తేమ ఉందని, ఎండలేదని ధర తగ్గిస్తున్నారు. మెట్‌పల్లి మార్కెట్‌లో గ్రేడింగ్ మిషన్లు లేకపోవడంతో వ్యాపారులు చెప్పే గ్రేడింగ్ ఆధారంగానే ధరలను నిర్ణయిస్తున్నారు. ఈనామ్ సరిగా అమలుకాకపోవడం కూడా వ్యాపారులకు కలిసి వస్తోంది. అధికారులు మాత్రం ఈ నామ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయని, వ్యాపారులు సిండికేట్ కావడానికి అవకాశం లేదని చెబుతున్నారు.
20 రోజుల్లో 18 వేల క్వింటాళ్లు
మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌కు ప్రతీ రోజు సుమారు 500 క్వింటాళ్ల పసుపు వస్తోంది. గత నెలలో కొనుగోళ్లు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు సుమారు 18వేల క్వింటాళ్ల వ్యాపారం జరిగింది. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, కోరుట్ల మండలాలతో పాటు నిజామాబాద్ జిల్లా భీంగల్ , కమ్మర్‌పల్లి, మోర్తాడ్ , నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, లక్ష్మణచంద మండలాలకు చెందిన రైతులు ఇక్కడికి పసుపు తీసుకొస్తుంటారు. జిల్లాలో ఈసారి 18వేల ఎకరాల్లో పసుపు సాగయినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ లెక్కన సుమారు 5 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు.
పసుపు రైతుల గోస తెలిసేలా చేద్దాం
పసుపు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మెట్‌పల్లిలో మంగళవారం రైతులు మహాధర్నా చేపట్టనున్నారు. పసుపు రైతుల గోస ప్రభుత్వాలకు వినిపించేలా చేద్దామని రైతు ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. మహాధర్నా లో రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని రైతు ఐక్య వేదిక నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి కోరారు. సోమవారం జిల్లాలోని పలు గ్రామాల్లో రైతు సంఘాల నాయకులు, రైతులతో సమావేశమయ్యారు.
పలువురు లీడర్లు మాట్లాడుతూ దశాబ్దాల పాటు పోరాటాలు చేసి పసుపు బోర్డు సాధించుకున్నామని తెలిపారు. అయినా ఇప్పటికీ మద్దతు ధర అందడం లేదని వాపోయారు. ప్రస్తుతం క్వింటాకు రూ.10వేల లోపే ఉందని, మద్దతు ధర కోసం మరోసారి పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మార్కెట్లలో దళారుల మాయాజాలంతో రైతులు నష్టపోతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని కోరారు. రైతుల మహాధర్నాకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు సంఘీభావం తెలిపారు. మహాధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.