సాంగ్లీలో ఇచ్చే రేటు ఇక్కడెందుకివ్వరూ..ఇందూర్​ గంజ్​లో పసుపు రైతుల ధర్నా

సాంగ్లీలో ఇచ్చే రేటు ఇక్కడెందుకివ్వరూ..ఇందూర్​ గంజ్​లో పసుపు రైతుల ధర్నా
  • హోలీనాటికి తేల్చాలని హెచ్చరిక

​నిజామాబాద్, వెలుగు : ‘మహారాష్ట్ర సాంగ్లీలో పసుపు క్వింటాల్​కు రూ.13 వేలు ఇస్తుండ్రు..  అదే రేటు ఇక్కడెందుకివ్వరూ.. వ్యాపారులు సిండికేట్​గా మారి మమ్మల్ని ముంచుతున్నారు..’ అంటూ పుసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నిజామాబాద్​ మార్కెట్​ గంజ్​లో పసుపు రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ  పసుపు క్వింటాల్​కు రూ.9,500 ఇస్తే గిట్టుబాటు కాదన్నారు.

 న్యూడెమాక్రసీ పార్టీ అనుబంధ రైతు కూలీ సంఘం స్టేట్​ సెక్రటరీ వి.ప్రభాకర్ నాయకత్వంలో మార్కెట్​ కమిటీ చైర్మన్​ ముప్ప గంగారెడ్డి, కార్యదర్శి అపర్ణను ప్రశ్నలతో నిలదీశారు. ఈ-నామ్​ విధానంలో రేటు ఫిక్స్​ చేయడం ఆపేసి ఓపెన్​ రేటు  ప్రకటించాలన్నారు.  

ప్రతి క్వింటాల్ పసుపునకు ప్రభుత్వం​ రూ.వెయ్యి బోనస్ ఇవ్వాలన్నారు. హోలీ పండుగ వరకు  చూసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల రాస్తారోకో చేయగా అదనపు కలెక్టర్ కిరణ్​కుమార్​ నేతృత్వంలో రైతులు, వ్యాపారుల మీటింగ్​ ఏర్పాటు చేసి క్వింటాల్ కొమ్ము పసుపునకు రూ.9,500 ధర నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరికొందరు రైతులు ఆ ధరను వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు.