మెట్ పల్లి, వెలుగు: పసుపు పంటకు మెట్ పల్లి మార్కెట్‌లో మంచి రేటు పలుకుతోంది. తాజాగా క్వింటాల్‌కు రూ.15,111 రికార్డు ధర దక్కింది. 15 ఏండ్ల తర్వాత రూ.15వేలు దాటడం ఇదే తొలిసారి. తాజా రేట్లపై పసుపు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లోనూ ఇంతకుమించి ధర పలుకుతున్నప్పటికీ దూరభారం నేపథ్యంలో రైతులు మెట్ పల్లి, నిజామాబాద్ మార్కెట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. మెట్ పల్లి మార్కెట్‌కు రోజుకు సుమారు రెండు వేల క్వింటాళ్ల నుంచి 3 వేల క్వింటాళ్ల వరకు పసుపు వస్తోంది. పసుపు పంటకు కనీస మద్దతు ధర రూ. 15 వేలు నిర్ణయించాలని కొంతకాలంగా రైతులు డిమాండ్ చేస్తుండగా, తాజాగా వారి కల నెరవేరింది.
పెరగనున్న సాగువిస్తీర్ణం..
2009 కన్నా ముందు మెట్ పల్లి, నిజామాబాద్, సాంగ్లీ మార్కెట్లలో పసుపు క్వింటాల్‌కు రూ.15 వేలకు పైగా పలికేది. ఆ తర్వాత రేట్లు తగ్గుతూ వచ్చాయి. పెట్టుబడులు మీద పడ్తుండడంతో రైతులు పసుపు సాగును క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారు. జగిత్యాల జిల్లాలో ఒకప్పుడు 45 వేల ఎకరాలకు పైగా పసుపు పంట వేయగా, ఈ ఏడాది 22 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. తాజాగా రేట్లు పెరగడంతో సాగు కూడా పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు.