![పసుపు ట్రేడర్ల సిండికేట్](https://static.v6velugu.com/uploads/2025/02/turmeric-prices-slump-in-nizamabad-market-farmers-in-distress_vREh6z31qe.jpg)
- సరైన రేటు రాక రైతుల పరేషాన్
- సాంగ్లీ కన్నా రూ 5 వేలు తక్కువ
- మార్కెట్ మీద బడా ట్రేడర్ల పెత్తనం
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ అగ్రికల్చర్ మార్కెట్లో రెండు వారాలుగా పసుపు కొనుగోళ్లు జరుగుతున్నాయి. సరుకు భారీగా వస్తుండడంతో ట్రేడర్లు సిండికేట్‌గా మారి రేట్ తగ్గించారు. ట్రేడర్లకు అడ్తిదారులు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది సీజన్ మొదట్లో క్వింటాల్‌కు రూ.13 వేల రేటు ఉండగా ఈసారి రూ.11 వేలకు పడిపోయింది. ఒకవైపు తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గిందని రైతులు ఆందోళన చెందుతుండగా ధరలో దగా వారికి మరింత ఆందోళన కలిగిస్తోంది.
24,662 ఎకరాల్లో సాగు
దేశంలోనే ఎక్కువగా పసుపు సాగు చేసే జిల్లాగా నిజామాబాద్‌కు గుర్తింపు ఉంది. రాష్ట్రంలో 60 శాతం పసుపు జిల్లాలోనే పండుతుంది. ఈ సీజన్లో జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల్లో 24,662 ఎకరాల్లో పంట సాగయ్యింది. ఈసారి జిల్లాలో ఎర్ర గుంటూరు రకం పసుపు మాత్రమే పండించారు. జగిత్యాల, మెట్పల్లిలో కూడా పసుపు సాగవుతుంది. అక్కడి రైతులు కూడా నిజామాబాద్‌కే సరుకు తీసుకొస్తారు.
ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిఉండగా, తెగుళ్లు సోకి 15 క్వింటాళ్లకు తగ్గింది. దిగుబడి తగ్గిన దిగులుతో ఉన్న రైతులు గిట్టుబాటు ధర రాక ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌కు రోజుకు 12 వేల క్వింటాళ్ల సరుకు వస్తోంది. మరో వారం పది రోజుల్లో మరింత పెద్ద ఎత్తున సరుకు రానుంది. నిరుడు సీజన్ ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.13 వేల రేటు వచ్చింది. సీజన్లో గరిష్ఠంగా క్వింటాలుకు రూ.19 వేల రికార్డు ధర లభించింది. ఈ సారి మాత్రం రేటు ఇంకా రూ.11 వేలకే పరిమితమయ్యింది.
సాంగ్లీలో 14,800
పసుపు మార్కెట్‌ను ఐదుగురు బడా సేట్లు నియంత్రిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో సిండికేట్ అయిన వ్యాపారులు ఈసారి క్వింటాలుకు రూ.11 వేల కన్నా రేటు పెట్టవద్దని తీర్మానించుకున్నారు. క్వాలిటీ లేదని, తేమ ఎక్కువుందని అడ్తిదారులు కొర్రీలు పెడుతూ రేటు రాకుండా అడ్డుపడుతున్నారు. తమ 2 శాతం కమిషన్ కోసం వారు ట్రేడర్లకు సహకరిస్తున్నారు. పసుపు ప్రధాన మార్కెట్ అయిన మహారాష్ట్ర సాంగ్లీ గంజ్‌లో ఎర్ర గుంటూరు పసుపు క్వింటాలుకు రూ.14,800 వస్తోంది. సాంగ్లీలో క్వాలిటీ ఆధారంగా రేటు డిసైడ్ చేస్తుంటే ఇక్కడ మాత్రం వ్యాపారులు చెప్పిందే రేటుగా సాగుతోంది. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పడిందని సంబురపడుతున్న రైతులను రేటు నిరాశ పరుస్తోంది.
అధిక మాయిశ్చర్ కారణం
ఇప్పుడొస్తున్న పసుపులో 15 నుంచి 28 శాతం తేమ ఉంటోంది. అందువల్లే రేటు రావడం లేదు. 12 శాతం మాయిశ్చర్‌తో పసుపు తెస్తే మంచి ధర వచ్చేలా చూస్తాం. ఎండలు పెరుగుతున్నందున ఇకపై ఎండిన పసుపు వస్తుందని భావిస్తున్నం. అడ్తిదార్లతో సంబంధంలేకుండా రైతులు నేరుగా మా వద్దకు వస్తే సరుకు అమ్మిపెడతం.- శంకర్‌దాస్, మార్కెట్ సెక్రెటరీ
రేట్ వర్సెస్ సిండికేట్
ట్రేడర్లు సిండికేట్కావడంవల్ల పసుపు రేట్ తగ్గింది. రైతులు నష్టపోకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి. ఏటా పెట్టుబడులు పెరుగుతుంటే రేట్ తగ్గించడం అన్యాయం. – బుల్లెట్ రాంరెడ్డి, పసుపు రైతు, బాల్కొండ
బోనస్ ఇవ్వాలి
నిజామాబాద్‌లో వ్యాపారులు సిండికేట్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే గత ఏడాది కన్నా తక్కువ రేటుకు కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మద్దతు ధర వచ్చేలా చూడాలి. లేదంటే క్వింటాల్‌కు రూ.1,500 బోనస్ అయినా ఇవ్వాలి. ఆంధ్రలో బోనస్ ఇస్తున్నారు. - నూతుల శ్రీనివాస్‌రెడ్డి, పసుపు రైతు, ఆర్మూర్