పసుపు రేట్​ .. రూ.17 వేలకు చేరిన క్వింటాల్ ధర​

పసుపు రేట్​ .. రూ.17 వేలకు చేరిన క్వింటాల్ ధర​

నిజామాబాద్, వెలుగు :  ఈ ఏడాది పసుపు పంట రైతులకు కాసులు కురిపిస్తున్నది. గడిచిన పందేడ్లల్లో 7వేలు కూడా దాటని పసుపు ధర.. ఈసారి అనూహ్యంగా మూడు రేట్లు పెరిగింది. సోమవారం నిజామాబాద్​గంజ్​లో  క్వింటాల్​కు రూ.17,011 దక్కగా, మహారాష్ట్రలోని సాంగ్లీలో ఏకంగా19,400  లభించింది. దీంతో పెరిగిన రేట్లపై రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతున్న. విదేశాల్లో పసుపుకు డిమండ్​ పెరగడమే ధర పెరుగుదలకు కారణమని, అతి త్వరలో క్వింటాల్​ రేట్​రూ.20 వేలు దాటవచ్చని వ్యాపారులు చెప్తున్నారు.

పెరిగిన దిగుబడి 

నిజామాబాద్​ మార్కెట్​ కమిటీ అవరణలోని గంజ్ కు ఉమ్మడి నిజామాబాద్​, కరీంనగర్​, అదిలాబాద్​ జిల్లాల నుంచి పసుపు దిగుబడులు పోటెత్తుతున్నాయి.​ నెల కింద సేల్స్​ షురూకాగా.. ఇప్పటిదాకా లక్షా 50 వేల క్వింటాళ్లు విక్రయించారు.  రూ.14 వేలతో మొదలైన రేట్​ఎప్పటికప్పుడు పెరుగుతూ.. తాజాగా రూ.17,011కు చేరింది. ప్రస్తుతం పచ్చి పసుపు వస్తుండగా, పూర్తిగా ఆరబెట్టిన పసుపును తెస్తే  మరింత రేటు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్​లో ఉడికించి పూర్తిగా ఆరబెట్టిన పాలిష్​ పసుపునకు క్వింటాల్​ రూ.18,900 దాకా ధర పలుకుతున్నది. దాంతో బాల్కొండ, ఆర్మూర్​ సెగ్మెంట్​ రైతులు అటు వరుస కట్టారు. 

మొన్నటి దాకా నేల చూపులే.. 

గడిచిన పదేండ్లలో పసుపు రేట్లు క్వింటాల్​ కు రూ.6,500 నుంచి రూ.7 వేలకు అటుఇటుగా పలికాయి.  దీంతో పెట్టుబడులు కూడా రాక నిజామాబాద్​జిల్లాలో  సాగును 32వేల ఎకరాల నుంచి  25 వేల ఎకరాలకు తగ్గించారు. మున్ముందు సాగు మరింత తగ్గుతుందని ఆందోళన చెందుతున్న తరుణంలో తాజా రేట్లు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. వచ్చే సీజన్​లో సాగు మరింత పెరిగే అవకాశముందని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు.  

ఈ రేట్ ​అసలు ఊహించలే

గతేడాది వరకు నాకున్న 22 ఎకరాల్లోని 11 ఎకరాల్లో పసుపు పండిచేవాడ్ని. ఎప్పుడూ క్వింటాల్​ రేట్​ రూ.7 వేలు దాటలే.  దీంతో ఈసారి ఆరెకరాల్లో వేసిన . మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలించి క్వింటాల్​ రూ.18,900  చొప్పున అమ్మిన. నా తరువాత కాంట పెట్టిన మా విలేజ్​కు చెందిన బద్ధం ప్రశాంత్​కు రూ.19,400 ధర లభించింది. రూ.20 వేల ధర కచ్చితంగా దాటేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే వచ్చే ఏడాది పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతుంది.