- రెండేళ్లలో స్టోర్లు 400కు చేరుతాయి
హైదరాబాద్, వెలుగు: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటెయిల్ చెయిన్ బిగ్–సీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రూ.1,500 కోట్ల టర్నోవర్ టార్గెట్ పెట్టుకుంది. 2022–23లో కంపెనీ టర్నోవర్ రూ.1,000 కోట్లు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో బిగ్–సీ కంపెనీకి 250 అవుట్‌లెట్లు ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో వీటిని 400 లకు చేరుస్తామని కంపెనీ ఫౌండర్, సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. బిగ్–సీ పుట్టి ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్ బాబు శామ్‌సంగ్ కొత్త మోడల్స్ ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్లను లాంఛ్ చేశారు.
బిగ్–సీ ఈడీ స్వప్న కుమార్, డైరెక్టర్లు బాలాజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కైలాష్ తో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2002 డిసెంబర్ 23న బిగ్–సీ జర్నీ మొదలైంది. మొబైల్స్ రిటెయిల్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచి 20 ఏళ్ల జర్నీని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసిన తాము, మూడవ దశాబ్దంలోనూ ఇలాగే టాప్ ప్లేస్‌లో కొనసాగుతామనే ధీమాను బాలు చౌదరి వ్యక్తం చేశారు. 2,500 మంది ఉద్యోగుల సహకారంతో 3 కోట్ల మంది వినియోగదార్లను సొంతం చేసుకున్నామని , ఉద్యోగుల సంఖ్యను రెండేళ్లలో 4 వేలకు పెంచుతామని చెప్పారు. మొబైల్స్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ అప్లయెన్స్స్ కూడా తమ స్టోర్లలో అందుబాటులో ఉంటాయని, ఈ విస్తరణ కోసం రూ. 300 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టనున్నామని కంపెనీ వెల్లడించింది. కర్నాటక, మహారాష్ట్ర, ఒడిషాలలో అడుగు పెడతామని తెలిపింది.
ఆర్గనైజ్డ్ రిటెయిల్ లీడర్...
దేశంలో మొబైల్స్ రిటెయిల్ను ఆర్గనైజ్డ్ దిశలో నడిపించిన ఘనత తమదేనని బాలు చౌదరి పేర్కొన్నారు. 2006 నుంచి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నామని అన్నారు. మొబైల్స్‌ను డిస్‌ప్లే చేయడం మాతోనే మొదలయిందని, స్టోర్‌లో మొబైల్‌ఫోన్ టచ్ అండ్ ఫీల్‌ను సాధ్యం చేశామని వివరించారు. క్వాలిటీ ప్రొడక్టుల సేల్స్‌తోపాటు, కస్టమర్లకు అందించే మెరుగైన సేవల వల్లే వారి మన్ననలు పొందగలుగుతున్నామని, ఈ సందర్భంగా కస్టమర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని బాలు చౌదరి చెప్పారు. టెలికం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మొబైల్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలతో కలిసి కస్టమర్లకు లేటెస్ట్ మోడళ్లను అందిస్తున్నామని బాలు చౌదరి తెలిపారు. రాబోయే రోజుల్లో 5జీ కొత్త రికార్డులు నమోదు చేయనుందన్నారు. కరోనా తర్వాత మొబైల్స్ రిటెయిల్‌లో ఆఫ్‌లైన్ వాటా ఏకంగా 65 శాతానికి చేరిందని అన్నారు.