కూలీ డబ్బుల కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవలో.. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన బాలానగర్ లో చోటుచేసుకుంది. కాశీరాం, శ్రీనివాస్ అనే ఇద్దరు అడ్డా కూలీల మధ్య రూ.400 కోసం జరిగిన వాగ్వాదమే ఈ హత్యకు దారితీసింది. నర్సాపూర్ చౌరస్తా పక్కన ఫుట్ పాత్ పై నిలబడి కూలీ డబ్బులు పంచుకునే విషయంలో వీరిద్దరు గొడవపడ్డారు. శ్రీనివాస్ ను కర్రతో కొట్టి.. అటుగా వెళ్తున్న లారీ కిందకు కాశీరామ్ తోసేశాడు. దీంతో లారీ కిందపడి శ్రీనివాస్ మృతిచెందాడు.
వివరాల్లోకి వెళితే.. ఎప్పటిలాగే గత శుక్రవారం (డిసెంబరు 23న) కూడా కాశీరాం, శ్రీనివాస్ లు కలిసి కూలీ పనులు చేశారు. వచ్చిన కూలీ డబ్బులో చెరో రూ.1200 చొప్పున వస్తాయని లెక్కలు వేసుకున్నారు. అయితే శ్రీనివాస్ కు రూ.800 ఇచ్చిన కాశీరాం.. మరో రూ.400 ఇవ్వలేదు. ఈ డబ్బుల విషయంలోనే ఆదివారం ఉదయం బాలానగర్ లేబర్ అడ్డా వద్ద ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి.. తోపులాట చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన కాశీరాం.. శ్రీనివాస్ పై కర్రతో దాడి చేసి అతన్ని తోసేశాడు. దీంతో శ్రీనివాస్ ఆ వైపుగా వస్తున్న లారీకింద పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.