నారాయణ ఖేడ్ ఎమ్యెల్యే దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం:TUWJ

నారాయణ ఖేడ్ ఎమ్యెల్యే దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం:TUWJ

హైదరాబాద్ ,వెలుగు:  లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వెయ్యి మందితో అట్టహాసంగా జన్మదిన వేడుక నిర్వహించిన నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి ఉదంతాన్ని V6 పార్ట్ టైం కరస్పాండెంట్ పరమేశ్వర్ వెలుగులోకి తేగా, అతనిపై కక్ష్యగట్టి దౌర్జన్యంగా ఇంటి నిర్మాణాన్ని కూల్చేయడం సహించరానిదని టీయు డబ్ల్యూ జే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్ , విరాహాత్ ఆలీ అన్నారు. ఈ చర్యను మా సంఘం తీవ్రంగా ఖండిస్తుందని గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేయాలని ఓ వైపు సీఎం కేసీఆర్ పిలుపు నిస్తుండగా, మరోవైపు ఇలాంటి ఆర్భాటాలతో ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు భగ్నం చేయడం విచారకరమన్నారు. ఎమ్యెల్యే కూల్చి వేయించిన కట్టడాన్ని వెంటనే తిరిగి నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో సరైన రీతిలో గుణపాఠం చెబుతామని నేతలు హెచ్చరించారు. ఈ అప్రజాస్వామిక చర్యను అన్ని వర్గాలు ఖండించాలని కోరుతున్నట్లు నేతలతో పాటు రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్ , సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కే మల్లికార్జున్ రెడ్డి, జిల్లా కార్యదర్శి విష్ణుకుమార్ లు డిమాండ్ చేశారు.