జర్నలిజానికి మచ్చ తేవద్దు : విరాహత్ అలీ

జర్నలిజానికి మచ్చ తేవద్దు :  విరాహత్ అలీ
  • టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

గజ్వేల్, వెలుగు: జర్నలిస్టుల పేరుతో దోపిడీకి పాల్పడుతూ పవిత్రమైన వృత్తికి మచ్చ తెస్తున్న నకిలీ ముఠాలకు తగినరీతిలో బుద్ధి చెబుతామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ హెచ్చరించారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన గజ్వేల్ నియోజకవర్గ టీయూడబ్లూజే సమావేశంలో పాల్గొని యూనియన్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్యన జర్నలిస్టుల పేరుతో కొన్ని అసాంఘిక శక్తుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని, ప్రజలను, అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

అలాంటి ముఠాల కదలికలపై తమ సంఘం కన్నేసి పెట్టిందని, ప్రజాకోర్టులో వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ ను స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలు జరుపుతామన్నారు. ప్రభుత్వం వర్కింగ్​ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి సానుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సురేందర్, మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ, కృష్ణ, జగదీశ్, కిరణ్, మునీర్, యాదగిరి పాల్గొన్నారు.