
ఖమ్మం, వెలుగు : కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్న ఖమ్మం నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పేరబోయిన తిరుపతిరావుకు టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) యూనియన్ అండగా నిలిచింది. టీయూడబ్ల్యూజే బృందం సభ్యులు శుక్రవారం తిరుపతిరావు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన కుటుంబానికి రూ.20 వేలు ఆర్థికసాయం అందజేశారు.
తిరుపతిరావు అనారోగ్య పరిస్థితిని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగానే రాష్ట్ర మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ తిరుపతిరావుకు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి తదితరులు ఉన్నారు.