శద్ధా వాకర్ హత్య కేసు వల్లే తునీషాకు బ్రేకప్

శద్ధా వాకర్ హత్య కేసు వల్లే తునీషాకు బ్రేకప్

ముంబై : శ్రద్ధా వాకర్ హత్య తర్వాత దేశంలో నెలకొన్న వాతావరణంతో తాను కలతచెందానని, దీంతో తునీషా శర్మతో రిలేషన్‌‌షిప్‌‌ను ముగించాలని నిర్ణయించుకున్నానని టీవీ యాక్టర్ షీజన్ ఖాన్ చెప్పాడు. 20 ఏండ్ల తునీషా ఆత్మహత్య కేసులో ఆమె సహ నటుడైన షీజన్‌‌ను పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా సోమవారం తొలిరోజు పోలీసులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన షీజన్.. ‘‘శ్రద్ధా వాకర్ కేసు తర్వాతి పరిణామాలను చూసిన తర్వాత తునీషా శర్మతో నా రిలేషన్‌‌షిప్‌‌ను ముగించాను. ఇద్దరి వయసుల మధ్య (8 ఏండ్లు) తేడా, ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వాళ్లమని చెప్పి తునీషాకు బ్రేకప్ చెప్పా” అని తెలిపినట్లు తెలిసింది. తామిద్దరి బ్రేకప్ తర్వాత తునీషా ఆత్మహత్యకు యత్నించిందని, అప్పుడు తాను కాపాడానని, తునీషాను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె తల్లికి చెప్పానని షీజన్ ఖాన్ తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

తునీషా తల్లి మాత్రం.. ‘‘నా బిడ్డను షీజన్ మోసం చేశాడు” అని ఆరోపిస్తున్నారు. ‘‘తునీషాను పెండ్లి చేసుకుంటానని షీజన్ మాటిచ్చాడు. కానీ తర్వాత బ్రేకప్ చెప్పాడు. మరో మహిళతో సంబంధం ఉన్నప్పటికీ.. తునీషాతో రిలేషన్ కొనసాగించాడు. ఇప్పుడు నా బిడ్డను కోల్పోయాను. అతడిని శిక్షించాలి” అని ఓ వీడియో మెసేజ్‌‌లో డిమాండ్ చేశారు.  కాగా, తునీషా కేసులో ఇప్పటికైతే లవ్ జిహాద్ కోణం తమకు కనిపించలేదని పోలీసులు చెప్పారు.