తమిళనాడు రాష్ట్రాన్ని ఓ కుటుంబం దోచుకుంటోంది: టీవీకే చీఫ్ విజయ్

తమిళనాడు రాష్ట్రాన్ని ఓ కుటుంబం దోచుకుంటోంది: టీవీకే చీఫ్ విజయ్
  • ద్రవిడ వాదం పేరుతో ప్రజల్ని మోసం చేస్తోంది: టీవీకే చీఫ్ విజయ్ 
  • 2026లో పవర్​లోకి వస్తాం 
  • పెరియార్, అంబేద్కర్, అన్నాదురై బాటలోనే నడుస్తాం 
  • సెక్యులర్, సామాజికన్యాయమే మా ఎజెండా
  • కుల, మత, జాతి వివక్షను తొలగిస్తాం.. అందరినీసమానంగా చూస్తాం    
  • టీవీకే తొలి స్టేట్ కాన్ఫరెన్స్​ లోరాజకీయ ప్రసంగం 

విల్లుపురం: తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. తెరవెనుక డీలింగ్స్ పెట్టుకుంటూ, ద్రవిడియన్ మోడల్ పేరుతో ప్రజలను ఆ కుటుంబం మోసం చేస్తోందని పరోక్షంగా అధికార డీఎంకే పార్టీపై ఆయన మండిపడ్డారు. 

తమిళ సినిమాల్లో ఎన్నో బాక్సాఫీస్ హిట్లతో ‘దళపతి’గా పేరు తెచ్చుకున్న విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగం(తమిళనాడు విజయ సమాఖ్య) పార్టీని స్థాపించారు. ఆదివారం సాయంత్రం తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవండిలో జరిగిన టీవీకే తొలి స్టేట్ కాన్ఫరెన్స్ లో విజయ్ తన మొదటి రాజకీయ ప్రసంగం చేశారు. పార్టీ ఎజెండా, ఐడియాలజీ గురించి వివరించారు. 

పెరియార్ రామస్వామి, కె. కామరాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, వేలు నచియార్, అంజలై అమ్మాళ్ బాటలోనే తమ పార్టీ నడుస్తుందని ప్రకటించారు. ముందుగా వంద అడుగుల పోల్ పై ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. టీవీకే సెక్యులర్ విధానానికి గుర్తుగా ఈ సందర్భంగా విజయ్ కి పార్టీ నేతలు భగవద్గీత, బైబిల్, ఖురాన్, రాజ్యాంగం ప్రతులను అందజేశారు. 

అనంతరం సభకు హాజరైన లక్షలాది మంది అభిమానులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ‘‘రాజకీయాల్లో నేను పసిబిడ్డలాంటి వాడిని. కానీ భయపడే ప్రసక్తే లేదు” అని విజయ్ స్పష్టం చేశారు. పూర్తి అవగాహనతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఇకపై వెనకడుగు వేయబోనన్నారు.

 అయితే, రాజకీయ రంగం సినిమాలాంటిది కాదని, ఇది ఒక యుద్ధక్షేత్రమని అన్నారు. రాజకీయాలను సీరియస్ గా, చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందన్నారు. 

లౌకిక, సామాజిక న్యాయమే ఎజెండా..  

ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్నవారు ద్రవిడియన్ మోడల్ పేరుతో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విజయ్ మండిపడ్డారు. ‘‘మేం ఏదో ఒక పేరు పెట్టి ఎవరిపైనా దాడులు చేయాలని అనుకోవడం లేదు. మేం ప్రజల కోసం పని చేసేందుకే వచ్చాం. వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే పార్టీలు, పెరియార్, అన్నాదురై, ద్రవిడియన్ మోడల్ ఆశయాలను దుర్వినియోగం చేసే పార్టీలే మాకు సిద్ధాంతపరమైన శత్రువులు” అని ఆయన ప్రకటించారు. 

 ‘‘ద్రవిడ, తమిళ జాతీయవాదం వంటి వాటి జోలికి మేం పోదల్చుకోలేదు. ఆ రెండూ ఈ గడ్డకు రెండు కండ్లవంటివి. ఏదో ఒక ప్రత్యేక గుర్తింపుతో మనం పరిమితం కావొద్దు. అన్ని కులాలు, మతాలు, వర్గాలను కలుపుకొనిపోయి  లౌకిక సామాజిక న్యాయం సాధించే దిశగా టీవీకే పని చేస్తుంది” అని విజయ్ స్పష్టం చేశారు.