
ఏదైనా పని చేస్తున్నప్పుడు కొంత మంది ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఇంకొంతమంది చేసే పని మీద ఏకాగ్రత కోల్పోతారు. దీని వల్ల పనిలో తప్పులు దొర్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజుల్లో చాలా మంది అదేపనిగా గంటల తరబడి స్మార్ట్ ఫోన్, టీవీలను చూస్తుంటారు. దీని వల్ల వచ్చే ఫ్లాష్ లైటింగ్ మెదడుపై ప్రభావం చూపిస్తుందంటున్నారు సైకాలజిస్టులు.
అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పది నిమిషాల కన్నా ఎక్కువగా దేనిపైనా ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. రీసెంట్ గా ఓ స్డడీ ప్రకారం స్టూడెంట్లు.. ఉద్యోగులు కేవలం పది నిమిషాలు మాత్రమే ఏకాగ్రతగా ఉంటున్నారని తేలింది. పని ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందటానికి సరిగ్గా నిద్ర పోకుండా సోషల్ మీడియాలో గడుపుతున్నారట. ఈ ప్రభావం ముఖ్యంగా ఏకాగ్రత మీద పడుతోందంటున్నారు స్టడీ చేసిన పరిశోధకులు. మరి ఏకాగ్రత పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
అవగాహన : ఏ పని చేసినా అవగాహనతో చేయాలి. మెదడుకు ప్రతి నిమిషం పని చెప్పటం చాలా అవసరం. మనసు మాట వినడటం కన్నా, మెదడు మాట వినడం మంచిది. ఇలా చేయటం వల్ల ప్రతి విషయంపైనా స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. అలాగే ఎమోషన్స్ ని అదుపులో ఉంచుకుంటారు. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఒక అంశంపైన అవగాహన కలిగి ఉంటారో.... అప్పుడే సరైన ఆలోచనా విధానం వస్తుంది. అలాగే పనిలో నైపుణ్యం కూడా పెరుగుతుంది.
Also Read:-పిల్లలతో పుస్తకాలు చదివిస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..!
క్రియేటర్ గా: ఎన్నో ఆలోచనలతో మెదడుకి పనిభారం పెరిగిపోతుంది. అందుకే వాటిలో ఇష్టమైన ఒక అంశాన్ని మాత్రమే తీసుకోవాలి. దాన్నే చాలా రకాలుగా ఆలోచించాలి. ఆ అంశం గురించి స్నేహితులతో చర్చించాలి. దానివల్ల క్రియేటివిటీ పెరగటంతో పాటు కాన్సన్స్ట్రేషన్ కూడా పెరుగుతుంది.
నిద్ర: రోజులో కనీసం ఆరు గంటలైనా ప్రశాంతంగా నిద్ర పోవాలి. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర, ఆహారం విషయంలో కచ్చితంగా టైమ్ సెన్స్ పాటించడం చాలా అవసరం. ఇలాచేయటం వల్ల ఏకాగ్రత పెరగటంతో పాటు చేసే పనిలో నైపుణ్యం కూడా పెరుగుతుంది. పోషకాలున్నవి తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. వీలైనంత వరకు స్వీట్స్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్, జంక్ ఫుడ్ వంటి వాటికి -దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటి నెగెటివ్ ప్రభావం మెదడుపై ఎక్కువగా ఉంటుంది.
ఆలోచనలను పేపర్‌పై రాయాలి : వచ్చిన ప్రతి ఆలోచనను పేపర్ పైఎప్పటికప్పుడు రాయాలి. ఇలా ప్రతిరోజూ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అయితే కేవలం చదివిన అంశాలను, నేర్చుకున్న వాటిని మాత్రమే రాయాలి. మనసును బాధ పెట్టే అంశాలను రాయకపోవటం మంచిది. దీని వల్ల ఆలోచనా శక్తి బాగా పెరుగుతుంది.
శ్వాస తీసుకోవటం : ఏకాగ్రత పెరగాలంటే ముఖ్యంగా శ్వాస మీద ధ్యాస పెడుతూ గాలి పీల్చుకోవాలి. ఇది ఆరోగ్యానికి మంచి వ్యాయామం. ఇలా రోజూ కొన్ని నిమిషాలు చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే రోజూ ప్రాణాయామం చేయడం కూడా ముఖ్యం.