గ్వాలియర్ : సౌతాఫ్రికా నుంచి 12 చిరుతలు భారత్కు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు చీతాలను తీసుకొచ్చిన విమానం గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ల్యాండైంది. వాటిని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కూనో నేషనల్ పార్క్ కు తరలించనున్నారు. సౌతాఫ్రికా నుంచి వచ్చిన 12 చిరుతల్లో 7 మగ, 5 ఆడ చీతాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వాటిని కూనో నేషనల్ పార్క్లోని క్వారంటైన్ ఎన్క్లోజర్లోకి విడిచి పెట్టనున్నారు. చిరుతల కోసం పార్కులో ప్రత్యేకంగా 10 క్వారంటైన్ ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. భారతీయ వన్యప్రాణి చట్టాల ప్రకారం ఇతర దేశాల నుంచి తీసుకువచ్చిన ఓ జంతువునైనా 30 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచాలి.
గతేడాది సెప్టెంబర్ లో నమీబియా నుంచి 8 చీతాలను భారత్కు తీసుకువచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 17 న వాటిని కూనో నేషనల్ పార్కులో వదిలిపెట్టారు. ప్రస్తుతం నమీబియా నుంచి తెచ్చిన చిరుతలు హంటింగ్ ఎన్ క్లోజర్ లో ఉన్నాయి. త్వరలోనే వాటిని అడవిలో స్వేచ్ఛగా వదిలిపెట్టనున్నారు.