
పన్నెండేళ్ల తర్వాత మళ్లీ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్న సినిమా ఇది. మహేష్‌కి జంటగా పూజాహెగ్డే నటించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ‘అతడు’లో మహేష్ పాత్రని గుర్తు చేసేలా ‘పార్థు’ అనే టైటిల్ పెడతారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ కొత్తగా ‘అర్జునుడు’ అనే టైటిల్ తెరపైకొచ్చింది. రెండు పేర్లకూ అర్థం ఒకటే. ‘అ’ అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్స్‌కి ప్రాధాన్యతనిస్తారు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి ‘అర్జునుడు’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అయితే అర్జున్, అతిథి, ఆగడు లాంటి టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు మహేష్ బాబును నిరాశపర్చాయి. ‘అతడు’ కూడా టీవీలో మాత్రమే హిట్. దీంతో మహేష్‌కి కలిసిరాని ‘అ’ అక్షరంతో టైటిల్ పెడతారా అనే అనుమానాలు లేకపోలేదు. యేటా మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ సినిమాలకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్స్ లాంటివి రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఈ బర్త్ డేకి త్రివిక్రమ్ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే టైటిల్ ఇదేనా కాదా అనే విషయంలో ఆరోజు క్లారిటీ వస్తుంది.