వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో మినీ ఎత్తిపోతల పథకాలకు కనీస మరమ్మతులు చేయకపోవటంతో ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్వహణ గాలికి వదిలేయటంతో భూములు బీళ్లుగా మారాయి. కృష్ణానది నీటిని ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ప్రస్తుతం వాటిని తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవటంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మోటార్లను, ఇతర సామగ్రిని దొంగలు ఎత్తుకెళుతున్నారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సాగు నీటి సంఘాలను రద్దుచేశారు. ఆ తరువాత మినీ లిఫ్ట్ లు ఒక్కొక్కటీ మూల పడుతూ వస్తున్నాయి.
అవగాహన లేని అధికారులు
జిల్లాలో చిన్నంబావి, చెల్లెపాడు, చిన్నమారు, పెబ్బేరు మండలంలో రాంపూర్, మదనాపురం మండలం లో శంకరసమద్రం 1,2,సరళాసాగర్, నెల్విడీ, అమరచింత, కొత్తకోట మండలంలోని నాటెల్లి, పెబ్బేరు మండలంలోని మహిభూపాల ఎత్తిపోతల పథకాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇరిగేషన్ శాఖను ఒకే గొడుగు కిందికి తీసుకవచ్చిన ప్రభుత్వం వీటిపై దృష్టి సారించటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మదనాపురం మండలంలోని నెల్విడి ఎత్తిపోతల పథకానికి రూ.15 కోట్లు ఖర్చు చేశారు. ఒకటి రెండు సీజన్ లో నామమాత్రంగా నీరందించి పూర్తిగా మూలకు పడేశారు. నాలుగు సంవత్సరాలుగా ఎకరం భూమికి కూడా నీరందించటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3,600 ఎకరాలకు నీరందక రైతులు వర్షాలపై ఆధారపడి సేద్యం చేస్తున్నారు. ఈ పథకం పునరుద్ధరణపై దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి రైతులు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా లాభం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులకు ఈ ఎత్తిపోతల పథకాలపై ఏ మాత్రం అవగాహన లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
చివరి ఆయకట్టు కష్టాలు
జూరాల కాలువలు పూర్తిగా ధ్వంసమై చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా తీరంలోని వీపనగండ్ల, చిన్నంబావి మండలాలలోని ఎత్తిపోతల పథకాలను ప్రారంభించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూరాల నీరు అందుతున్నదని వీటిని మూలకు పడవేశారన్నారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిగా తమ పరిస్థితి మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి మోటార్లను బాగు చేసి పైప్ లైన్లను సరిచేస్తే ఈ పథకాలు తిరిగి ప్రారంభమవుతాయని రైతులు అంటున్నారు.
వానాకాలం పంటలకు నీరందించాలి..
జిల్లాలో మూలకు పడ్డ ఎత్తిపోతల పథకాలకు వెంటనే రిపేర్లు చేయాలి. వానకాలం సీజన్ మరో నెల రోజుల్లో మొదలవుతుంది. సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలి. పనులు ప్రారంభించకుంటే రైతుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తాం.
- వేముల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కిసాన్ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి జిల్లా.