జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలివ్వాలి...సీఎం రేవంత్​కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఈ టర్మ్ లోనే కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవ పున్నయ్య కోరారు . సుప్రీంకోర్డు ఆదేశాలతోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి ఇండ్ల స్థలాలకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినందుకు  సీఎంకు, ప్రభుత్వానికి మంగళవారం ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. మిగతా జర్నలిస్టు సొసైటీలకు, సొసైటీల్లో సభ్యత్వం లేని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని కోరారు.

ఏండ్లుగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు. కొందరికి హౌసింగ్ సొసైటీల్లో సభ్యత్వం ఉందని, మరికొందరికి లేదని, వీరందరి కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానం ద్వారా ఇండ్లస్థలాలు కేటాయించాలని కోరారు. మేనిఫెస్టో ప్రకారం తొలి టర్మ్ లోనే జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెండో టర్మ్ లో ఇస్తామని సీఎం చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఇప్పటికే జర్నలిస్టులు ఇళ్ల స్థలాల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఇంకా ఏ మాత్రం జాప్యం జరిగినా మరింత ఆందోళన చెందుతారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్థలాల గుర్తింపు ప్రక్రియ చేపట్టి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇవ్వాలని ప్రభుత్వానికి మామాడి సోమయ్య, బసవ పున్నయ్య రిక్వెస్ట్ చేశారు.