నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. నైజీరియాలోని ఈశాన్య బోర్నో రాష్ట్రంలో జరిగిన మూడు బాంబు పేలుళ్ల ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. జూన్ 2024, జూన్ 29వ తేదీ శనివారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఓ వివాహ వేడుకలో మొదటి పేలుడు సంభవించింది. ఆ తరువాత జనరల్ హాస్పిటల్ గ్వోజాలో రెండవ పేలుడు, అనంతరం అంత్యక్రియల వద్ద మూడవ పేలుడు సంభవించింది.
బోర్నో స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ(SEMA) డైరెక్టర్ జనరల్ బార్కిండో ముహమ్మద్ సైదు గ్వోజా టౌన్‌లో జరిగిన పేలుడు సంఘటనాస్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని రెస్క్యూ సిబ్బంది చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
బోర్నో స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ-సెమా ప్రకారం.. మరణించిన వారిలో పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరాలేదు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.