- మృతులను అంకిత్ సాకేత్, బిందుగా ఐడెంటిఫై
- ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్‌లో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇద్దరి ముఖాలు గుర్తుపట్టలేని విధంగా బండరాళ్లతో మోది అతి దారుణంగా చంపేశారు. నార్సింగి ఏరియాలోని పుప్పాలగూడ క్రషర్స్ క్వారీలో ఆదివారం రాత్రి ఘటన జరగగా.. మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
పతంగులు ఎగురవేసేందుకు గుట్టపైకి వెళ్లిన యువకులకు రెండు మృతదేహాలు కనిపించడంతో వారు వెంటనే డయల్ 100కి కాల్ చేశారు. నార్సింగి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రెండు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించారు. దర్యాప్తులో భాగంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం రాత్రి ఏం జరిగింది...!
మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ (30) నానక్‌రామ్ గూడలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా హౌసింగ్ కీపింగ్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. చత్తీస్‌గఢ్ కు చెందిన బిందు(25), తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి శంకర్‌పల్లిలోని ఓ సైట్‌లో నివసిస్తున్నది. అక్కడే బిందుకు సాకేత్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది గమనించిన సైట్ సిబ్బంది.. బిందు ఫ్యామిలీని అక్కడి నుంచి పంపించేశారు.
దీంతో వారు ఎల్బీ నగర్‌కు షిఫ్ట్ అయ్యారు. అయినప్పటికీ సాకేత్, బిందుల మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ నెల 3న బిందును సాకేత్ నానక్‌రామ్‌గూడకు తీసుకొచ్చాడు. తన స్నేహితుడి రూమ్‌లో బిందును ఉంచాడు. దాంతో బిందు భర్త తన భార్య కనిపించడం లేదంటూ వనస్థలిపురం పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు.
అత్యాచారం చేశారా..?
ఆదివారం రాత్రి సాకేత్, బిందులు కలిసి క్రషర్స్ క్వారీ వద్దకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడేవారిపై దాడి జరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఇద్దరిని కత్తితో పొడిచి, తలపై బండరాళ్లతో మోది అతిదారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. బిందు ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్య జరిగి దాదాపు మూడు రోజులు కావడంతో ఇద్దరి ముఖాలు గుర్తించలేని విధంగా మారిపోయాయి. టాటూ ఆధారంగా సాకేత్ ను గుర్తించారు. ఈ రెండు హత్యలకు కారణం వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.