ఎఫ్​టీఎల్‎కు చేరువలో జంట జలాశయాలు

ఎఫ్​టీఎల్‎కు చేరువలో జంట జలాశయాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జంట జలాశయాలైన ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్‎కు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్​సాగర్​కెపాసిటీ 1,790 అడుగులు(3.900 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1,784 అడుగుల మేర నీరు చేరింది. ఇన్​ఫ్లో 3వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అలాగే హిమాయత్​సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం  1,763.500 అడుగులు(2.900 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1,759.250 అడుగులకు నీరు చేరింది. 

ఇన్​ఫ్లో1,500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి రెండు జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రెండు లేదా మూడు గేట్లను తెరిచి నీటిని మూసీలోకి విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ జలాశయాన్ని వాటర్​బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్ సోమవారం సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, వాటర్​బోర్డు సీజీఎం రవీందర్ రెడ్డి, జీఎం డేవిడ్ రాజ్, రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

లక్నాపూర్​ ప్రాజెక్ట్​ అలుగు పారుతోంది..!

భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లాలోని లక్నాపూర్ ప్రాజెక్ట్ నిండింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి అలుగు పారుతోంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సోమవారం వందల సంఖ్యలో తరలివచ్చారు. సందర్శకుల తాకిడి పెరగడంతో పోలీసులు బందోబస్త్​ఏర్పాటు చేశారు.