
- కవలల దినోత్సవం రోజునే మృత్యు ఒడికి
రేగొండ, వెలుగు : పౌడర్పాలు వికటించి కవల పిల్లలు చనిపోయారు. ఈ ఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో జరిగింది. గొల్లపల్లికి చెందిన మర్రి అశోక్, లాస్య దంపతులకు నాలుగు నెలల క్రితం కవలలు(ఆడ, మగ) జన్మించారు. లాస్య డెలవరీ అయినప్పటి నుంచి తన పుట్టిల్లు అయిన నగరంపల్లిలోనే ఉంటున్నది. ఇద్దరు పిల్లలకు పాలు సరిపోక పోవడంతో డబ్బా పాలు పట్టిస్తున్నారు. ఈక్రమంలో శనివారం గణపురం మండల కేంద్రం నుంచి పాల డబ్బాను తీసుకువచ్చిన లాస్య.. పాలు కలిపి ఇద్దరు చిన్నారులకు పట్టించింది. అనంతరం.. బాబును ఉయ్యాలలో, పాపను బెడ్‌మీద పడుకోబెట్టారు.
అర్ధగంట తర్వాతమంచంపై పడుకోబెట్టిన పాప ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. దాంతో ఆర్ఎంపీ డాక్టరుకు సమాచారం ఇవ్వగా ఆయన ఘటనా స్థలానికి చేరుకుని పాపను పరిశీలించాడు. పాప ముక్కులోంచి పాలు బయటకు వచ్చినట్లు తెలిపాడు. అనంతరం ఉయ్యాలలో పడుకున్న బాబు కుడా ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు పరీక్షించగా కవలలు చనిపోయినట్లుగా నిర్ధారించారు. మృతి చెందిన కవలలను గొల్లపల్లికి తీసుకెళ్లారు. చిన్నారుల మృతితో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, పౌడర్కలిపిన పాలు తాగడం వలే చిన్నారులు మృతి చెందారని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కవలల మృతికి పౌడర్ పాలే కారణమా లేక ఇంకా మరేదైన కారణం ఉందా అనేది వైద్యులు పిల్లలకు పట్టించిన పాల పౌడర్‌ను పరీక్షిస్తేగాని తెలియదు. కవలల దినోత్సవం రోజునే కవలలు చనిపోవడం పలువురిని కలిచివేస్తున్నది.