
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించడం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తనను భారత్‌కు అప్పగించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తహవుర్ రాణా అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తహవుర్ రాణా పిటిషన్‌ను అమెరికా అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించడంతో.. ఈ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు రాణా అప్పగింత సాధ్యం కాదు. తనను విచారణ కోసం భారత్‌కు అప్పగించడాన్ని ఇప్పటికే ఓ సారి రాణా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఈ తీర్పుపై రాణా మరోసారి కోర్టులో అప్పీల్ చేశాడు. ఈ పిటిషన్‌పై జడ్జిమెంట్ వచ్చే వరకు రాణా తరలింపు ఆలస్యం కానుంది.
కాగా, ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన మోడీ.. ముంబై పేలుళ్ల సూత్రధారి రాణాను విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించాలని కోరాడు. మోడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ట్రంప్.. రాణాను విచారణ కోసం భారత్‌కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రాణాను ఇండియా తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిందితుడు తహవుర్ రాణా కోర్టును ఆశ్రయించడంతో తరలింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఈ ప్రక్రియకు ముందుకు కదలనుంది.
పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన రాణా గతంలో పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. 2008 దాడుల వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అతడు భౌతిక సహాయం చేశాడు. దీంతో 2011లో ఫెడరల్ జ్యూరీ అతన్ని దోషిగా నిర్ధారించింది. 2008, నవంబర్ 26న ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఐకానిక్ తాజ్ మహల్ హోటల్‌తో సహా ముంబైలోని అనేక ప్రదేశాలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో పోలీసులు, భద్రతా దళాలకు చెందిన 20 మంది సిబ్బంది, 26 మంది విదేశీయులు సహా 166 మంది మరణించారు. ఇందులో భాగంగానే రాణాను విచారించేందుకు అప్పగించాలని భారత్ అమెరికాను కోరింది.