ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని మోదీ, అమిత్ షాకు వదిలేశానని ప్రెస్మీట్ నిర్వహించి మరీ చెప్పిన ఏక్నాథ్ షిండే మనసు మారినట్లు తెలుస్తోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న షిండే శుక్రవారం జరగాల్సిన మహాయుతి కూటమి రెండు కీలక సమావేశాలను రద్దు చేసుకుని మరీ తన సొంతూరు సతారా వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గురువారం సాయంత్రం అమిత్ షాతో ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై జరిగిన చర్చలు నచ్చకే ఏక్నాథ్ షిండే అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ హైకమాండ్తో జరిగిన చర్చలు షిండేకు ఆమోదయోగ్యం లేవని, అందుకే ఉన్నట్టుండి ఆయన కీలక సమావేశాలు ఉన్న సంగతి తెలిసి కూడా శుక్రవారం సొంతూరు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఏక్ నాథ్ షిండే తన సొంతూరుకి వెళ్లిపోవడంతో మహారాష్ట్రలో మంత్రి పదవుల పంపకం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏక్ నాథ్ షిండే మళ్లీ ముంబైకి శనివారమే వెళతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. షిండే అలకంతా ముఖ్యమంత్రి పదవి కోల్పోయినందుకు కాదని, మంత్రి పదవుల విషయంలోననే చర్చ తెరపైకొచ్చింది.
ALSO READ | సర్కారులో సగం బెర్తులు బీజేపీకే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి.. ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 43 మంత్రి పదవుల్లో 12 బెర్తులను మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 9 పదవులు ఇవ్వవచ్చని తెలుస్తోంది. మిగతా మంత్రి పదవులను బీజేపీ తన వద్దే ఉంచుకోనుంది.
ముఖ్యమంత్రి ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాదే తుది నిర్ణయం అని స్పష్టం చేసిన షిండేకు పట్టణాభివృద్ధి, ప్రజాప్రనులు, జలవనరుల శాఖలు కేటాయించే చాన్స్ ఉంది. అయితే.. ప్రభుత్వంలో కీలక శాఖ అయిన హోం మంత్రిత్వ శాఖ ఆశిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు అడ్డుపడబోనని, ఎవరిని ముఖ్యమంత్రిగా ఖరారు చేసినా పూర్తి మద్దతు ఇస్తానని షిండే ఇదివరకే పేర్కొన్నారు. కాగా.. సీఎం పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందున్నారు.