వేలిముద్రలు మ్యాచ్ కాలే: సైఫ్​ అలీఖాన్ పై దాడి కేసులో ట్విస్ట్

వేలిముద్రలు మ్యాచ్ కాలే: సైఫ్​ అలీఖాన్ పై దాడి కేసులో ట్విస్ట్
  • ఇంట్లో దొరికిన వేలిముద్రలు, నిందితుడి ఫింగర్ ప్రింట్స్ పరిశీలన
  • ఫింగర్ ప్రింట్స్ వేర్వేరని తేల్చిన నిపుణులు

ముంబై: బాలీవుడ్  నటుడు సైఫ్  అలీఖాన్ పై జరిగిన హత్యాయత్నం కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులకు కొత్త ట్విస్టు ఎదురైంది. ఆయన ఇంట్లో దొరికిన వేలిముద్రలు.. సైఫ్ ను కత్తితో పొడిచిన నిందితుడు షరీఫుల్  ఇస్లాం ఫింగర్ ప్రింట్లతో మ్యాచ్  కావడంలేదని పోలీసులకు క్రిమినల్ ఇన్విస్టిగేషన్  డిపార్ట్ మెంట్(సీఐడీ) వెల్లడించింది. ఆ వేలిముద్రలు ఇస్లాంవి కావని సిస్టం జనరేటెడ్  రిపోర్టులో తేలిందని, ఫలితం నెగెటివ్ గా వచ్చిందని సీఐడీ తెలిపింది.

దీంతో పోలీసులు మరిన్ని శాంపిల్స్ ను పరీక్షల కోసం పంపారు. కాగా.. తనకు నకిలీ పౌరసత్వం డాక్యుమెంట్లు ఇప్పిస్తానని, ఇందుకు డబ్బు ఇవ్వాలని ఒక వ్యక్తి చెప్పాడని, డబ్బు కోసం సైఫ్​ ఇంట్లో చొరబడి దొంగతనానికి యత్నించానని బంగ్లాదేశ్ కు చెందిన నిందితుడు ఇస్లాం పోలీసులకు తెలిపాడు. దీంతో, నకిలీ పౌరసత్వం ఇప్పిస్తామని ఇస్లాంకు మాట ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానితుడు బాంద్రా స్టేషన్ లో రైలు ఎక్కినట్లు భావిస్తున్నారు.

స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీల్లో అనుమానితుడిని గుర్తించేందుకు ముంబై పోలీసులు.. వెస్టర్న్  రైల్వే సాయం తీసుకుంటున్నారు. కాగా.. షరీఫుల్  ఇస్లాం అక్రమంగా భారత్ లో ప్రవేశించాడు. దొంగతనం చేసేందుకు ఈనెల 15న సైఫ్  ఇంట్లోకి చొరబడ్డాడు. అడ్డుకున్న సైఫ్ ను ఆరుసార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు. దీంతో సైఫ్ కు వెన్నెముకతో పాటు పలుచోట్ల గాయాలయ్యాయి. వెంటనే ఆయన ఆటోలో లీలావతి ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందారు. గాయం నుంచి సురక్షితంగా బయట పడడంతో డాక్టర్లు ఆయనను ఈనెల 21న ఆయన డిశ్చార్జి చేశారు.

నా జీవితం నాశనం చేశారు

ముంబై పోలీసులు తన జీవితాన్ని నాశనం చేశారని, తనకు న్యాయం కావాలని డ్రైవర్  ఆకాశ్  కనోజియా (31) అన్నాడు. సైఫ్​పై హత్యాయత్నం కేసులో పోలీసులు మొదట ఆకాశ్​ను అనుమాని తుడిగా భావించారు. చత్తీస్​గఢ్​లో అరెస్టు చేశారు. తర్వాతి రోజు షరీఫుల్  ఇస్లాంను ముంబై పోలీసులు అరెస్టు చేయడంతో ఆకాశ్​ను వదిలేశారు. అయితే, అప్పటికే సైఫ్​పై హత్యాయత్నా నికి పాల్పడిన నిందితుడు అంటూ తనను టీవీల్లో చూపించారని ఆకాశ్​ వాపోయా డు. ఈ వార్తలతో ఉద్యోగం పోయిందని, పెండ్లి కూడా ఆగిపోయిందని చెప్పాడు. పోలీసుల తప్పిదంతో తను, తన కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.