అది పిల్లి పనే.. టప్పచబుత్రా హనుమాన్ ఆలయంలో మాంసం ఘటనలో ట్విస్ట్

అది పిల్లి పనే.. టప్పచబుత్రా హనుమాన్ ఆలయంలో మాంసం ఘటనలో ట్విస్ట్

హైదరాబాద్: టప్పచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ ఆలయం ప్రాంగణంలో గల శివాలయంలో మాంసం ముద్దలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏకంగా గర్భగుడిలో శివలింగం పక్కనే మాంసపు ముద్దులు కనబడటంతో భక్తులు, ఆలయ పూజారులు, అధికారులు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఈ వార్త ఆ నోట ఈ నోట హైదరాబాద్ అంతా క్షణాల్లోనే వ్యాపించింది. శివ లింగంపై మాంసపు ముద్దలు వేయడంతో భక్తులు, హిందు సంఘాలు భగ్గమన్నాయి. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 

హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దుండగులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. హిందు సంఘ నేతలతో మాట్లాడి.. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో హిందు సంఘ నేతలు ఆందోళన విరమించారు. 

ALSO READ | హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దల కలకలం..ఖంగుతిన్న భక్తులు

మతపరమైన అల్లర్లు  చెలరేగే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా హనుమాన్ ఆలయం, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఇక, ఈ ఘటనను సీరియస్‎గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయ సమీపంలోని 17  సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. మంగళవారం (ఫిబ్రవరి 11) రాత్రి నుండి బుధవారం (ఫిబ్రవరి 12) ఉదయం వరకు టెంపుల్‎లోకి ఎవరు రాలేదు పోలీసులు నిర్ధారించారు.

ఒక్క సీసీటీవీ కెమెరాలో మాత్రం పిల్లి నోట్లో మాంసం పట్టుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఉదయం నుంచి ఉత్కంఠ రేపిన హనుమాన్ ఆలయ మాంసపు ముద్ద ఘటనను పోలీసులు కొలిక్కి తీసుకొచ్చారు. హునుమాన్ ఆలయంలో మాంసపు ముద్ద తీసుకొచ్చి పడేసింది మనుషులు కాదు.. పిల్లి అని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చంద్ర మోహన్ ప్రకటించారు.