ట్విట్టర్ సంస్థ మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. బ్లూ టిక్ కలిగిన యూజర్లు..తమ ట్వీట్లను పోస్ట్ చేసిన తర్వాత గంట వరకు వాటిని ఎడిట్ చేసేందుకు అనుమతి కల్పించింది. ఈ మేరకు ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది.
2022 అక్టోబర్ లో మొదటిసారిగా ట్విట్టర్ ఎడిట్ ఆఫ్షన్ ను ప్రవేశపెట్టింది. ప్రారంభంలో యూజర్లు తమ పోస్టును పోస్ట్ చేసిన 30 నిమిషాల్లో ఎడిట్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. యూజర్ల డిమాండ్ మేరకు ఈ సమయాన్ని గంటకు పొడిగించింది. ఎడిట్ ఆఫ్షన్ ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ లభిస్తోంది.
ట్విట్టర్ కొత్త CEOగా లిండా యాకారినోను ప్రకటించిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ ఫీచర్ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే. ఈ స్పెషల్ ఫీచర్ ద్వారా ఎక్కువ మంది బ్లూ టిక్ ప్రీమియం సేవను ఎంచుకునే అవకాశం ఉందని ట్విట్టర్ భావించింది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ వినియోగదారులు బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అదే వెబ్ యూజర్లు నెలకు రూ.650కి చెల్లించాలి. బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులు తమ ట్వీట్‌లను ఎడిట్ చేసుకునే వీలును పొందుతారు. అంతేకాకుండా 1080పీలో వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. అలాగే, రిప్లై, మెన్షన్, సెర్చింగ్‌లో వీరికి ప్రాధాన్యత ఉంటుంది. సాధారణ వినియోగదారుల కంటే 50 శాతం తక్కువ అడ్వర్‌టైజ్‌మెంట్లు కనిపిస్తాయి. కొత్త ఫీచర్లకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. సబ్‌స్క్రైబర్లు తమ హ్యాండిల్, డిస్‌ప్లే పేరు లేదా ప్రొఫైల్ పిక్‌ను మార్చుకునే వీలు ఉంటుంది.