రాహుల్ ట్విట్టర్ అకౌంట్ లాక్!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ ఇండియా షాక్ ఇచ్చింది. రూల్స్​ను ఉల్లంఘించారంటూ ఆయన అకౌంట్​ను టెంపరరీగా లాక్ చేసింది. ఢిల్లీలో రేప్​కు గురైన 9 ఏండ్ల దళిత అమ్మాయి తల్లిదండ్రులను కలిసిన రాహుల్ బుధవారం ఆ ఫొటోను ట్వీట్ చేశారు. ఫొటోలో రేప్ బాధితురాలి కుటుంబసభ్యుల ముఖాలు క్లియర్​గా కన్పిస్తుండటంతో.. అది జువెనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్ కింద నేరమని జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం (ఎన్​సీపీసీఆర్) సీరియస్ అయింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసులను, ట్విట్టర్​ను ఆదేశించింది. దీంతో రాహుల్ ట్వీట్​ను తొలగించిన ట్విట్టర్.. ఆయన అకౌంట్​ను లాక్ చేసింది. సాధారణంగా ట్విట్టర్ రూల్స్​ను ఉల్లంఘించే ట్వీట్లు పెడితే.. ఆ తర్వాత 24 గంటల పాటు ఆ అకౌంట్ నుంచి ట్వీట్లు చేసేందుకు అనుమతి ఉండదు. అయితే రాహుల్ ట్విట్టర్ అకౌంట్ తాత్కాలికంగా సస్పెండ్ అయిందని, ఆయన ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా అందుబాటులో ఉంటారంటూ శనివారం కాంగ్రెస్ ట్వీట్ చేసింది. దీనిపై ట్విట్టర్ స్పందిస్తూ.. రాహుల్ అకౌంట్ సస్పెండ్ అవలేదని, సర్వీస్​లో కొనసాగుతోందని తెలిపింది. అకౌంట్ సస్పెండ్ అయితే పూర్తిగా కనిపించదని పేర్కొంది. ఆ తర్వాత రాహుల్ అకౌంట్ టెంపరరీగా లాక్ అయిందంటూ కాంగ్రెస్ మరో ట్వీట్ చేసింది. కానీ రాహుల్ ట్విట్టర్ అకౌంట్​ను లాక్ చేయడానికి ఆ ట్వీట్​తో రూల్స్ ఉల్లంఘించడమే కారణమా? ఇతర అంశాలేమైనా ఉన్నాయా? అన్నది ట్విట్టర్ వెల్లడించలేదు. ఆయన అకౌంట్ లో చివరి ట్వీట్ శుక్రవారం మధ్యాహ్నం 3.31 గంటలకు చేసినట్లుగా ఉంది.