గద్వాల/ఎల్బీనగర్, వెలుగు: గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడు సమీపంలో కారు డివైడర్ ను, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి వద్ద రెయిలింగ్‌ను మరో కారు ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురానికి చెందిన నరేష్ (23), పెబ్బేరు కు చెందిన పవన్ కుమార్(28), గద్వాలకు చెందిన ఆంజనేయులు(50) మరో ముగ్గురు కలిసి గద్వాల టౌన్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ నుంచి ఎలక్ట్రిక్కారులో పెబ్బేరుకు బయలుదేరారు.
కొంతదూరం వెళ్లాక జమ్మిచెడ్ విలేజ్ సమీపంలో పెట్రోల్ పంపు దగ్గర కారు వేగంగా డివైడర్ ను ఢీకొని పల్టీకొట్టింది. దీంతో కారు ముందు టైరు ఊడిపోవడంతోపాటు, రూఫ్ టాప్ లేచిపోయి అందులో ఉన్నవారు రోడ్డుపై చెల్లాచేదురుగా పడ్డారు. నరేశ్, పవన్‌కుమార్, ఆంజనేయులు స్పాట్‌లోనే చనిపోగా కేటిదొడ్డి మండలం మైలగడ్డకు చెందిన గోవర్ధన్, మల్దకల్ మండలం పాల్వాయికి చెందిన నవీన్, గద్వాలకు చెందిన మహబూబ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ లోని ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరికి గద్వాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
బర్త్‌డే పార్టీ నుంచి వెళ్తూ..
గద్వాల టౌన్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్ కూతురు బర్త్ డే వేడుకలకు ఆరుగురు ఫ్రెండ్స్హాజరయ్యారు. వేడుకలు ముగిశాక అక్కడే అంతా పార్టీ చేసుకున్నారు. ఒక వ్యక్తిని డ్రాప్ చేసి వచ్చేందుకు ఆరుగురు స్నేహితులు కారు తీసుకొని ఎర్రవల్లి చౌరస్తా వైపు కలిసి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురిలో నలుగురు సదరు ప్రైవేటు ఆసుపత్రిలో టెక్నీషియన్స్‌గా పనిచేస్తుండగా ఒకరు వార్డుబాయిగా, మరొక డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారుకు ఉన్న సెన్సార్ఫీచర్తో డయల్100కు, ఓనర్ కు మెసేజ్ వెళ్లింది. దీంతో వారు వెంటనే అప్రమత్తమై కారు లోకేషన్ ఆధారంగా యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాసులు, రూరల్ ఎస్సై ఆనంద్, టౌన్ ఎస్సై శ్రీకాంత్ పరిశీలించి ఘటన స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం గద్వాల ఆసుపత్రికి తరలించారు. అతివేగం, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఓవర్ స్పీడ్‌తో రెయిలింగ్‌ను ఢీకొట్టి..
ఓవర్ స్పీడ్ తో వచ్చిన కారు రోడ్డు పక్కన రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు, ఓ మహిళ స్పాట్‌లోనే చనిపోయారు. శనివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. హైదరాబాద్ గోల్కొండలోని హుస్సేని హాలం ఫతేకు చెందిన మెహమ్మద్ సాజిద్ (18).. రాజేంద్ర నగర్‌లోని హాసన్ నగర్ కు చెందిన తన స్నేహితులు మహ్మద్ గఫర్ (22), నాయీముద్దీన్ (21), లంగర్ హౌస్‌కు చెందిన నజియా బేగం (23), టోలి చౌక్ కు చెందిన ముస్కన్ మెహ్రాజ్ (22) కారులో శ్రీశైలం వైపు నుంచి మైలార్ దేవ్‌పల్లి వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది.
కార్ ఓవర్ స్పీడ్ తో ఉండడంతో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి వద్ద అదాని ఏరో స్పేస్ కంపెనీ, హార్డ్ వేర్ పార్క్ సమీపంలో అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. కారును నడుపుతున్న మొహమ్మద్ సాజిద్, మెహమ్మద్ గఫర్, నజియా బేగం అక్కడికక్కడే మృతి చెందారు. నయీ ముద్దీన్, ముస్కాన్ మెహ్రజ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. సాజిద్ తండ్రి మొహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.