
- ఇద్దరు నిందితుల అరెస్ట్
- మంథని సీఐ రాజుగౌడ్ వెల్లడి
మంథని, వెలుగు: మహిళ అకౌంట్ లోంచి డబ్బులు డ్రా చేసి జల్సాలకు పాల్పడిన ఇద్దరిపై పెద్దపల్లి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. మంథని సీఐ రాజు గౌడ్ శుక్రవారం మీడియాకు వివరాలు తెలిపారు. మంథని మండలం ధర్మారం (గద్దలపల్లి) గ్రామానికి చెందిన కందుకూరి లక్ష్మి కొడుకు చనిపోగా అతని అకౌంట్లోని రూ.4 .49 లక్షల నగదును గతేడాది ఏప్రిల్ 25న తన ఎస్ బీఐ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. అదే ఏడాది అక్టోబర్ 4న లక్ష్మి ఆ డబ్బులను డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్లింది.
ఆమె అకౌంట్ చెక్ చేసి డబ్బులు లేవని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దీంతో లక్ష్మీ మంథని పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు స్టేట్ మెంట్లు, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ కు చెందిన దామరకుంట అశోక్ (34), గుండ్ర ప్రశాంత్ కుమార్ (28)ను నిందితులుగా గుర్తించారు. లక్ష్మి బ్యాంక్ అకౌంటు నంబర్ ను వీరు తమ ఫోన్ నంబర్ పేటీఎం యాప్ కు అనుసంధానించుకుని డబ్బులు డ్రా చేసుకొని జల్సాలకు, కుటుంబ అవసరాలకు వాడారు. గురువారం నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.