చంచల్ గూడ జైలుకు డ్రగ్స్ కేసు నిందితులు

హైదరాబాద్ లోని  ఫుడింగ్ మింక్ పబ్  డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులు  అభిషేక్ , అనిల్ లను రిమాండ్ కు తరలించారు బంజారాహిల్స్ పోలీసులు. నిందితులిద్దరికి  14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో వారిని  చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. కేసులో మహదరం అనిల్ కుమార్ ఏ1గా, అభిషేక్ పుప్పాల ఏ2గా ఉన్నారు. ఏ3 అర్జున్ వీరమాచినేని, ఏ4 కిరణ్ రాజులిద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

మరో వైపు డ్రగ్స్ కేసులో  అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీలు, వీఐపీల పిల్లలను కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పబ్ లో దొరికిన 148 మందిలో ఒక్కరి నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోలేదు పోలీసులు. వీరిలో ఏ ఒక్కరిని కనీసం విచారించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. కేవలం పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అలసు పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి...? ఎక్కడి నుంచి తెచ్చారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు పోలీసులు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పోలీసులు హడావిడి చేయడం... ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు తీరు పై అంతటా విమర్శలొస్తున్నాయి. మరోవైపు సిటీలోని పబ్ ల్లో డ్రగ్స్ వ్యవహారం పై ఇప్పటి వరకు నోరుమెదపలేదు ఎక్సైజ్ శాఖ. పబ్ ల నిర్వహణపై పోలీసు, ఎక్సైజ్ శాఖ నిఘా లోపమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.