బ్యాంక్ దోపిడి కేసు.. 24 గంటల్లోనే ఎన్ కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం

బ్యాంక్ దోపిడి కేసు.. 24 గంటల్లోనే ఎన్ కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో సంచలనం సృష్టించిన బ్యాంక్ దోపిడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరిని యూపీ పోలీసులు ఎన్ కౌంటర్‎లో హతమార్చారు. మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్నోలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)కి చెందిన 42 లాకర్లను పగులగొట్టి కోట్ల విలువైన నగలు, ఇతర విలువైన వస్తువులను ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కాప్స్.. దర్యాప్తు ముమ్మురం చేశారు.

ఈ క్రమంలోనే చిన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ పథ్‌లో ఇద్దరు నిందితులు పోలీసులకు తారసపడ్డారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తిరిగి ఫైరింగ్ చేశారు. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ నిందితుడు సోబింద్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరో నిందితుడు పారిపోయాడు.  కిసాన్ పథ్‌ లో ఎస్కేప్ అయిన మరో నిందితుడిని ఘాజీపూర్‌లో హతమార్చారు పోలీసులు. 

ఎన్ కౌంటర్ లో మృతి చెందిన నిందితుడిని  సన్నీ దయాల్‎గా గుర్తించారు. బ్యాంక్ లాకర్ పగలగొట్టిన నిందితుడు దయాళ్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు ఎస్పీ ఈరాజ్ రాజా ధృవీకరించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రాబరీ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులు ఎన్ కౌంటర్‎లో మృతి చెందగా.. మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పరారీలో ఉన్న ముఠాలోని మరికొందరు సభ్యుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.