ఫ్రెండ్ కోసమే పదో తరగతి పేపర్ లీకేజీ

ఫ్రెండ్ కోసమే పదో తరగతి పేపర్ లీకేజీ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదో తరగతి పరీక్ష హిందీ పేపర్ లీకేజీని పోలీసులు ఛేదించారు. కమలాపూర్ బాయ్స్ హై స్కూల్ లో ఈ ఘటన జరిగిందని తేల్చారు.  పరీక్ష  కేంద్రంలోకి 16 ఏళ్ల బాలుడు దూకి కిటికీ పక్కన పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి క్వషన్ పేపర్ ను ఫోటో తీసి పాఠశాల వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో  బాలుడితో పాటు మరొకరిని అరెస్ట్ చేశామన్నారు. 

స్నేహితుడి కోసం..

వరంగల్ జిల్లా ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ  తరగతి పరీక్ష రాస్తున్న తన మిత్రుడికి పరీక్షలో సహాయం అందించడం కోసం 16 ఏళ్ల బాలుడు హిందీపేపర్ ను లీకేజీ చేసినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల గోడ దూకి కిటికి ప్రక్కనే పరీక్ష రాస్తున్న  బాలుడి నుండి  హిందీ పరీక్ష పత్రాన్ని ఉదయం 9.45 నిమిషాలకు  ఫోటో తీశాడని చెప్పారు. హిందీ పేపర్ ను మరో నిందితుడైన మౌటం శివ గణేష్ కు వాట్సాప్ నెంబర్ కు పోస్ట్ చేశాడని తెలిపారు.  అనంతరం రెండో నిందితుడైన మౌటం శివ గణేష్ ఉదయం 9.59 నిమిషాలకు తన సెల్ఫోన్ ద్వారా ఎస్.ఎస్.సి 2019-20 అనే వాటప్స్ గ్రూప్ లో  ఫార్వడ్ చేశారని వెల్లడించారు. మూడవ నిందితుడు ప్రశాంత్ సెల్ ఫోన్ కు ఎస్.ఎస్.సి 2019-20 గ్రూప్ నుండి ప్రశ్న పత్రం రావడంతో ఈ ప్రశ్న పత్రాన్ని నిందితుడు ప్రశాంత్ వివిధ గ్రూపులకు ఫార్వార్డ్ చేసినట్లు చెప్పారు.  దీనిపై విద్యా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు.