శంషాబాద్, వెలుగు: ఫేక్ రూ. 500 నోట్లను మార్పిడి చేస్తున్న ఇద్దరిని శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన గంగరాజు స్టాక్ బ్రోకరేజ్ బిజినెస్ చేసి పెద్ద ఎత్తున డబ్బు కోల్పోయాడు. అతనికి అభినందన్ పరిచయమవగా, ఇద్దరూ కలిసి ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు. 2 నెలల కిందట మహారాష్ట్రకు చెందిన సచివ్ పవార్, సురేష్ పవార్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ లో నకిలీ కరెన్సీ తయారీ వీడియోను చూశారు.
కొద్దిరోజులకు గంగరాజు, అభినందన్ మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లోని ఛద్వేల్‌కు వెళ్లి సచివ్ పవార్, సురేష్ పవార్‌ను కలిశారు. మార్కెట్‌లో చెక్ చేసుకునేందుకు నమూనాగా పది ఫేక్ రూ. 500 నోట్లను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ కు వచ్చి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన లక్కీ అనే వ్యక్తికి 5 నోట్లను ఇచ్చి మార్కెట్లో మార్పిడి చేయించారు. దీంతో ఈజీగా మారుతున్నాయని గ్రహించారు. గంగారాజు, అభినందన్ రూ. 3.5 లక్షల నగదు తీసుకుని మరోసారి సచివ్ పవార్, సురేష్ పవార్‌ను కలిశారు. రూ. 17 లక్షల విలువైన నకిలీనోట్లను తీసుకుని రూ. 3.5 లక్షలు (1:5 నిష్పత్తి) చెల్లించారు. పోలీసుల తనిఖీల భయంతో కొన్ని నకిలీ నోట్లను పారవేశారు. బెంగళూరుకు వెళ్లి తమిళనాడులోని తిర్పూరుకు చెందిన వ్యాపారి రవికి ఫేక్ నోట్లు ఇవ్వడానికి యత్నించారు. కానీ డీల్ కుదరలేదు. సిటీకి వచ్చి సికింద్రాబాద్‌లోని లాడ్జిలో బస చేశారు.
మల్కాజిగిరిలోని సాయిరాం థియేటర్ వద్ద నరేష్ అనే వ్యక్తి సాయంతో బైక్ అద్దెకు తీసుకుని నకిలీ నోట్లతో శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లి మెహఫిల్ రెస్టారెంట్‌కు వెళ్లారు. ముందస్తు సమాచారం మేరకు శంషాబాద్ జోన్ ఎస్వోటీ పోలీసులు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసు టీమ్ రైడ్ చేసి గంగరాజు, అభినందన్ ను పట్టుకుని రూ. 6.65 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. రూ. 500 నోట్ల కట్టల మధ్యలో నకిలీ నోట్లు పెట్టి మోసగిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.