
గజ్వేల్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ జిల్లాలో సెంట్రింగ్ డబ్బాలు దొంగిలిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. గురువారం గజ్వేల్ ఏసీపీ బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తున్న క్రమంలో బొలేరో ట్రాలీ వాహనంలో ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా సెంట్రింగ్ దొంగల ముఠా గుట్టు రట్టయింది.
నల్గొండ జిల్లా నేరెడిగొమ్ము మండలం పడమటి తండాకు చెందిన ముడావత్ హరి, ఇదే జిల్లా మల్లే పల్లి మండలం దేవరకొండకు చెందిన జరపుల రాంలాల్ కొందరితో కలసి ముఠాగా ఏర్పడి జిల్లాల్లో సెంట్రింగ్ డబ్బాలను చోరీ చేస్తున్నారు. వీటిని హైదరాబాద్లోని స్క్రాప్ షాప్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ముఠాలో ఉన్న 19 మంది సభ్యుల వివరాలు సేకరించి అందరిపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.