- ఇద్దరు అరెస్ట్..
- రూ. లక్షా 20 వేలు స్వాధీనం
హైదరాబాద్,వెలుగు: ఆన్‌లైన్ ట్రేడింగ్‌పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్‌కు చెందిన మహిళకు 2020 నవంబర్‌లో ఫేస్బుక్లో షేర్ మార్కెట్ కన్సల్టెంట్ సాక్షి మెహతా పేరుతో ఓ నోటిఫికేషన్ వచ్చింది. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో సెంట్రల్ ట్రేడ్ రీసెర్చ్ ఆఫీసును నడుపుతున్నట్లు ఆ వ్యక్తి ఆమెకు చెప్పాడు. ఆన్ లైన్ ట్రేడింగ్‌లో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి డీ మ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించాడు. మొదటి ఇన్షియల్ పేమెంట్ కింద రూ.8 లక్షలు, ఆ తర్వాత రూ.5 లక్షలు వసూలు చేశాడు. డిపాజిట్ చేసిన డబ్బుకు రూ.88 లక్షలు ప్రాఫిట్ వచ్చినట్లు చూపించాడు.
ఆ డబ్బును క్లయిమ్ చేసుకోవాలంటే సర్వీస్ చార్జీలు, ట్యాక్స్, జీఎస్టీ చెల్లించాలని మహిళ దగ్గరి నుంచి రూ.కోటి 20 లక్షలు వసూలు చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మధ్యప్రదేశ్‌ఇండోర్‌కు చెందిన రజత్‌పథేరియా(26), అశ్విన్‌బగ్దెర్(27) ఇలాంటి మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. మంగళవారం ఇండోర్‌లో వారిని అరెస్ట్ చేసి రూ.లక్షా 20 వేల క్యాష్, డెబిట్ కార్డులు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై గురువారం సిటీకి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లు సైబర్‌క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. వీరితో పాటు మరో ఏడుగురిని గుర్తించామని.. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామన్నారు.
పర్సనల్ లోన్ ఇస్తామంటూ మోసం
పర్సనల్ లోన్ ఇస్తామంటూ ఓ వ్యక్తి నుంచి సైబర్ క్రిమినల్ రూ.50 వేలు కొట్టేసిన ఘటన శంకర్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాకు చెందిన మెగావత్ సందీప్‌కు ముద్రా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ గత నెల 21న ఫోన్ కాల్ వచ్చింది. లోన్ ఇస్తామని, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డాక్యుమెంట్లు పంపాలని ఆ వ్యక్తి చెప్పాడు. లోన్ వస్తుందేమోనని నమ్మిన సందీప్ ఫోన్ చేసిన వ్యక్తి ఇచ్చిన మెయిల్‌కు వివరాలన్నీ పంపాడు. జనవరి 1న ఆ వ్యక్తి మళ్లీ సందీప్ కు కాల్ చేసి లోన్ అప్రూవల్ అయ్యిందని ట్యాక్స్, ఇన్సూరెన్స్, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.50 వేలు పంపాలన్నాడు. 2వ తేదీ సందీప్ ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్‌కు రూ.50 వేలు ట్రాన్స్ ఫర్ చేశాడు. గురువారం మళ్లీ ఫోన్ చేసి రూ.20 వేలు పంపాలని ఆ వ్యక్తి అడగడంతో సందీప్ తాను మోసపోయినట్లు గుర్తించి శంకర్ పల్లి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకర్ తెలిపారు.