‘లిక్కర్‌‌‌‌ బాటిళ్లే కారణం’.. మర్డర్ మిస్టరీని ఛేజ్ చేసిన పోలీసులు

‘లిక్కర్‌‌‌‌ బాటిళ్లే కారణం’.. మర్డర్ మిస్టరీని ఛేజ్ చేసిన పోలీసులు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్‌‌‌‌జిల్లా పెద్దేముల్‌‌‌‌ మండలం గోపాల్‌‌‌‌పూర్‌‌‌‌ గ్రామ శివారులో వారం కింద జరిగిన ఓ వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. చోరీ చేసిన లిక్కర్‌‌‌‌ బాటిళ్ల పంపకంలో తేడాలు రావడం వల్లే హత్య జరిగినట్లు నిర్ధారించి, ఇద్దరిని అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను తాండూర్‌‌‌‌ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి శుక్రవారం వెల్లడించారు. సల్బత్తాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన శ్రీకాంత్, రుద్రారం గ్రామానికి చెందిన నరేశ్‌‌‌ ఇద్దరూ కలిసి చోరీలు చేసేవారు. ఈ క్రమంలో వీరికి రుద్రారం గ్రామానికి చెందిన రమేశ్‌‌‌‌అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. ముగ్గురు కలిసి ఇటీవల ఓ కారులో కెమెరాను చోరీ చేయగా, ఓ కల్లు కాంపౌండ్‌‌‌‌లో 13 లిక్కర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ బాటిళ్లను దొంగిలించారు.

వారం కింద గోపాల్‌‌‌‌పూర్‌‌‌‌ గ్రామ శివారులోని సుద్ద గని ప్రాంతం వద్దకు చేరుకొని వాటాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో లిక్కర్‌‌‌‌ బాటిళ్ల పంపకంలో తేడాలు వచ్చాయి. దీంతో రమేశ్‌‌‌‌కు, మిగతా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనకు ఎక్కువ లిక్కర్‌‌‌‌ సీసాలు ఇవ్వాలని లేదంటే చోరీ విషయం అందరికీ చెప్పేస్తానని రమేశ్‌‌‌‌ మిగతా ఇద్దరిని బెదిరించాడు. దీంతో శ్రీకాంత్‌‌‌‌, నరేశ్‌‌‌‌ కలిసి బెల్ట్‌‌‌‌తో రమేశ్‌‌‌‌ గొంతు నులిమి హత్య చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల దగ్గర నుంచి మద్యం సీసాలు, కెమెరా, హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమావేశంలో తాండూర్‌‌‌‌ రూరల్‌‌‌‌ సీఐ అశోక్, పెద్దేముల్‌‌‌‌ ఎస్సై గిరి పాల్గొన్నారు.