బెల్లంపల్లి, వెలుగు: ఆవులు, గేదెలు ఇస్తామని రైతుల నుంచి రూ. లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఆరిజిన్ డెయిరీకి చెందిన ఇద్దరు ప్రధాన నిందితులను శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తీలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పలు డాక్యుమెంట్స్, బ్యాంక్ పాస్ బుక్స్, కంపెనీ లెటర్ ప్యాడ్స్, రైతుల నుంచి సేకరించిన డిపాజిట్ల రిసీప్ట్స్, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా సంతమగులురు మండలానికి చెందిన కందిమల్ల ఆదినారాయణ అలియాస్ కిషన్, అనంతపురం జిల్లా గంగవరానికి చెందిన బోడపాటి సెజల్ అలియాస్ నందిని తక్కువకాలం లో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు రైతులను మోసం చేయాలని ప్లాన్చేశారు.
బెల్లంపల్లి ప్రాంతానికి వచ్చి ప్రజలు, రైతులతో పరిచయం పెంచుకున్నారు. పశు శాఖపై పట్టున్న చిలరపు సంతోష్, కుమ్మరి పోశంను కంపెనీలో భాగస్వాములుగా చేసుకున్నారు. 2022 ఆగస్టు 11న 8 గేదెలు, 2 ఆవులను మహారాష్ట్రలోని డెయిరీ నుంచి తీసుకొచ్చారు. తాండూరులోని ఓ రైతుకు పశువులను ఇచ్చారు. ఆ ఫోటోలను మిగతా రైతులకు చూపించేవారు. రైతులు 35 శాతం డబ్బులు ఇస్తే 65 శాతం కంపెనీ చెల్లించి యూనిట్ పెట్టిస్తుందని నమ్మబలికారు. పశువుల ద్వారా వచ్చే పాలు కూడా తామే కొంటామని చెప్పేవారు. 65 శాతం తాము భరిస్తున్నామంటూ రైతుల నుంచి నాలుగు ప్రామిసరి నోట్స్, మూడు ఖాళీ చెక్కులు తీసుకునేవారు. రైతులు 35 శాతం డబ్బు కట్టిన తర్వాత 45 రోజుల్లో పశువులను ఇస్తామంటూ చెప్పేవారు. అలాగే పశువులు ఉన్న రైతుల దగ్గరికి వెళ్లి ఇన్సూరెన్స్ చేయిస్తామంటూ దాదాపు వెయ్యి మంది నుంచి రూ.708 చొప్పున, డిపాజిట్ పేరిట 18 మంది నుంచి రూ. 21 లక్షలు వసూలు చేశారు.
ఏడు పోలీస్ స్టేషన్లలో కేసులు
మాయమాటలు చెప్పి తప్పించుకు తిరుగుతుండడంతో బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లాలో నెన్నెల, బెల్లంపల్లి టూ టౌన్, బెల్లంపల్లి 1 టౌన్, కాసిపేట, తాండూర్, జన్నారం, జైపూర్ పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి.ప్రధాన నిందితుడైన కందిమల్ల ఆదినారాయణపై అత్తిలి పోలీస్ స్టేషన్ తో పాటు గుడివాడ, పంజాగుట్ట, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లలో పలు సెక్షన్ల కేసులు కూడా నమోదయ్యాయని డీసీపీ వివరించారు. నిందితులను పట్టుకున్న బెల్లంపల్లి ఏసీపీ మహేశ్‌తోపాటు రూరల్ సీఐ కోట బాబురావు, ఎస్సైలు ఆంజనేయులు, రాజశేఖర్ ను అభినందించారు.