రేషన్ అక్రమ రవాణా కేసులో ఇద్దరి అరెస్ట్

మిర్యాలగూడ, వెలుగు : సివిల్ సప్లై గోడౌన్ నుంచి ఏపీకి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన కేసులో తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖర రాజు వివరాలు వెల్లడించారు. హుజూర్ నగర్ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న 22 టన్నుల రేషన్ బియ్యం లారీని వాడపల్లి ఎస్ఐ రవి ఈనెల 5న పట్టుకున్నారు. 

ఈ కేసులో చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన హుజూర్ నగర్ ఎంఎల్ఎస్ పాయింట్ ఆర్ఐ షేక్ అబ్దుల్ నబి, ఎంఎల్ఎస్ పాయింట్(స్టేజీ–2) కాంట్రాక్టర్ ఊరుకొండ సంతోష్, మేడారం, బక్కయ్యగూడెం రేషన్ డీలర్లు కరణం పాండయ్య, కోన సత్యనారాయణ, దాచేపల్లికి చెందిన లారీ డ్రైవర్ మాదినేటి చంద్రశేఖర్, పెంచికల్ దిన్నకు చెందిన మద్ది నరేశ్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. 

ఇదే కేసుకు సంబంధించి పిడుగురాళ్లకు  చెందిన జోగుబర్తి ముక్కంటేశ్వరరావు, దాచేపల్లికి చెందిన కల్లూరి లింగయ్యను శనివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మరో ప్రధాన సూత్రదారి నరసింహారావు పరారీలో ఉన్నట్లు డీఎస్సీ తెలిపారు.  సమావేశంలో సీఐ వీరబాబు, ఎస్ఐ రవి, పోలీసులు పాల్గొన్నారు.