మిర్యాలగూడ, వెలుగు : చిరు వ్యాపారులు, ప్రజల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖర రాజు నిందితుల వివరాలు వెల్లడించారు. చందంపేట మండలం చౌటుట్ల తండాకు చెందిన కేతావత్ సురేశ్ మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం పరిధిలోని కేశవనగర్ లో నివాసం ఉంటూ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శ్రీలక్ష్మి మినీ రైస్ మిల్ ఓనర్ ధనావత్ నరేందర్ తో కలిసి చిరువ్యాపారులు, ప్రజల నుంచి రూ.10 కేజీ లెక్కన రేషన్ బియ్యం కొనుగోలు ఏపీకి తరలించేవారు.
గతనెల 31న కేతావత్ సురేశ్ ఇంట్లో నుంచి టాటా ఇంట్రా మినీ వాహనంలో 55 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని రైస్ మిల్లుకు తరలిస్తుండగా, వెంకటాద్రిపాలెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయడంతో నరేందర్ పై10 కేసులు నమోదు కాగా, అతడిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు.
మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 103 రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులు నమోదు కాగా, 246 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. 9 మందిపై రౌడీ షీట్, ఒకరిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు. మొత్తం 70 వాహనాల్లో తరలిస్తున్న 590 టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేసినట్లు చెప్పారు. సమావేశంలో మిర్యాలగూడ టూ టౌన్ సీఐ నాగార్జున, రూరల్ ఎస్ఐ లోకేష్, సిబ్బంది పాల్గొన్నారు.