
- అమెజాన్, బ్రిటానియా, గోద్రేజ్ పేర్లతో నకిలీ వెండర్లు
- ఏటా 22 శాతం రిటర్నులు ఇస్తామంటూ డిపాజిటర్ల నుంచి రూ.1700 కోట్లు వసూలు
హైదరాబాద్, వెలుగు: పోన్జీ స్కీమ్ పేరుతో ఆన్‌లైన్ లో మోసాలకు పాల్పడుతున్న ఫాల్కన్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వైస్ చైర్మన్ ఓదెల పవన్ కుమార్, డైరెక్టర్ కావ్య నల్లూరిని సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) ఆదివారం అరెస్టు చేసింది. వీరిద్దరూ పాల్కన్ ఇన్‌వాయిస్, పాల్కన్ క్యాపిటల్ వెంచర్స్‌కు హైదరాబాద్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు దేశవ్యాప్తంగా 7 వేల మంది డిపాజిటర్ల వద్ద రూ.1,700 కోట్లు వసూలు చేసి రూ.850 కోట్లు కుచ్చుటోపి పెట్టినట్లు ఆధారాలు సేకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైటెక్ సిటీ హుడా ఎన్‌క్లేవ్ కేంద్రంగా ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్‌లైన్ మల్టీ లెవల్ మార్కెటింగ్ నిర్వహిస్తోంది. అమర్ దీప్ కుమార్ డైరెక్టర్‌గా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సీఈవో యోగేందర్ సింగ్ కలిసి పోన్జీ స్కీమ్ పేరుతో 2021 నుంచి డిపాజిట్లు సేకరించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ కోసం మొబైల్ అప్లికేషన్లు, వెబ్‌సైట్లను రూపొందించారు. ఫ్యాబ్రికేటెడ్ ప్రొఫైల్స్‌తో బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ సహా పలు ప్రముఖ కంపెనీలకు సంబంధించిన వెండర్స్గా ప్రొఫైల్స్ తయారు చేశారు. వీటితో ఆన్‌లైన్‌లో ప్రకటనలు చేశారు.
తమ వద్ద ఆన్‌లైన్ లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ డిపాజిట్లు సేకరించారు. పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఏటా 11 శాతం నుంచి 22 శాతం రిటర్న్స్ ఇస్తామని నమ్మించారు. ఇలా నాలుగేండ్ల పాటు 6,979 మంది నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేశారు. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించారు. వారికి తిరిగి చెల్లించాల్సిన మరో రూ.850 కోట్లను 14 రకాల షెల్ కంపెనీల అకౌంట్లకు మళ్లించారు.
బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి
డిపాజిటర్లకు ఇవ్వాల్సిన రిటర్నులను నిందితులు తిరిగి ఇవ్వలేదు. డిపాజిటర్లు బదిలీ చేసిన డబ్బు హైటెక్ సిటీలోని పలు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయ్యేది. జనవరిలో కంపెనీ ఆపరేషన్లను ఎత్తివేశారు. ఢిల్లీకి చెందిన డిపాజిటర్ లలిత్ సోని రూ.9.4 కోట్లు కోల్పోయింది. సోనితో పాటు మరికొంత మంది డిపాజిటర్లు ఈనెల 11న సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవోడబ్ల్యూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఫాల్కన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ ఓదెల పవన్ కుమార్, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు అమర్‌దీప్ కుమార్, ఆర్యన్ సింగ్, యోగేందర్ సింగ్ సహా 10 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు.