కాగజ్ నగర్(కౌటాల), వెలుగు: ఆదమరచి ఆడుకుంటున్న ఆ చిన్నారులకు తెలియదు పాపం మృత్యువు తమ కోసం కాచుకుని కూర్చుందని.. పనుల్లో తలమునకలైన తల్లిదండ్రులు ఊహించలేకపోయారు పక్కనే నోరు తెరుచుకున్న బావి పిల్లలను మింగేస్తుందని.. తోటి పిల్లలు ఊహించలేదు సెలవు రోజునే తమ స్నేహితులు శాశ్వతంగా లోకానికి సెలవు పెడతారని.. కౌటాల మండలం నాగెపల్లికి చెందిన చిన్నారులు మోర్లె తిరుపతి (8), సిద్ధా ర్థ(7) బుధవారం ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. చూపరులను కలిచివేసింది.
తల్లిదండ్రులతోపాటు పంట చేనుకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన సంఘటన ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం నాగెపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మోర్లె సురేష్, పోచుబాయిల కొడుకు మోర్లె తిరుపతి(8), మోర్లె చంద్రయ్య, లక్ష్మీల కుమారుడు మోర్లె సిద్ధార్థ్(7) లు విజయనగరం సేయింట్ జోసెఫ్ హైస్కూలులో చదువుతున్నారు. తిరుపతి మూడో తరగతి చదువుతుండగా, సిద్ధార్థ్ రెండో తరగతి చదువుతున్నాడు. బుధవారం సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని బడికి సెలవు ఇచ్చారు. పంట చేనుకు బయలుదేరిన తల్లిదండ్రులతో మేమూ వస్తామంటూ పట్టుబట్టిన ఇద్దరు బాలురు వారితోపాటే పొలానికి వెళ్లారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా తిరుపతి, సిద్ధార్థ్‌లు ఆడుకుంటూ సమీపంలోని బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో జారి పడ్డారు.
సాయంత్రం దాటినా పిల్లలు కనపిం చకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతకగా బావిలో శవమై తేలారు. వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చనిపోయిన ఇద్దరు బాలురు అన్నదమ్ముల పిల్లలు కావడం, ఒకేసారి బావిలో విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల కంటతడి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారులు బావిలో పడి చనిపోవడంతో కుటుంబీకులు, బంధువులు మృతదేహాల వద్ద చేసిన రోధనలు మిన్నంటాయి. మోర్లె సురేష్, చంద్రయ్యలకు కుమారులు ఒక్కొక్కరే ఉన్నారు. వీరు ఇరువురు ఒకేసారి ఇలా చనిపోవడం వారి కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. ఘటన స్థలాన్ని కౌటాల సీఐ మోహన్, ఎస్సై ఆంజనేయులు, ఏఎస్సై హన్మండ్లు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.