చోరీ ఆరోపణలు.. ఇద్దరు బాలురు మిస్సింగ్

చోరీ ఆరోపణలు..  ఇద్దరు బాలురు మిస్సింగ్
  •     కేపీహెచ్​బీ కాలనీలో ఘటన

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ కాలనీలో అన్నదమ్ములైన ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. ఒక టెంపుల్​లో వీరిద్దరు చోరీకి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో తల్లి మందలించింది. దీంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటారని కేపీహెచ్​బీ పోలీసులు భావిస్తున్నారు. 

ఏపీలోని అనంతపురం జిల్లా నీలకోట తండాకు చెందిన ఆనంద్​నాయక్, చిట్టిబాయి దంపతులు. మూడు నెలల కిందట ఉపాధి కోసం సిటీకి వచ్చి కేపీహెచ్​బీ నాలుగో ఫేజ్​లోని​ శివాలయం సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడో తరగతి చదువుతున్న గణేశ్​నాయక్​(13), ఐదో తరగతి చదువుతున్న రాకేశ్​నాయక్​(10) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆనంద్​నాయక్​ స్వగ్రామానికి వెళ్లాడు. 

హౌస్​ కీపర్​గా పని చేసే చిట్టిబాయి గురువారం ఉదయం పనికి వెళ్తూ ఇద్దరు కొడుకులను ఇంట్లోనే ఉంచి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె ఇద్దరు కొడుకులు టెంపుల్లో చోరీ చేసినట్లు నిర్వాహకులు ఆరోపించారు. దీంతో ఆమె తన ఇద్దరు కొడుకులను మందలించింది. ఆ తర్వాత ఆడుకుంటామని చెప్పి బయటకు వెళ్లిన అన్నదమ్ములు ఇంటికి తిరిగిరాలేదు. ఎక్కడా వెతికినా ఫలితం లేకపోవడంతో చిట్టిబాయి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేపీహెచ్​బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.