
మెదక్, వెలుగు: తమ పెదనాయన అస్థికలు కలపడానికి వచ్చి ప్రమాదవశాత్తూ పోచారం ప్రాజెక్టులో మునిగి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. మెదక్–కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. హవేలీ ఘనపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇనాం తండాకు చెందిన అన్నదమ్ములు హరి సింగ్ (45) చౌహాన్, బాల్ సింగ్ (41 ) చౌహాన్.. ఇటీవల చనిపోయిన తమ పెదనాయన అస్థికలను పోచారం ప్రాజెక్టులో కలిపేందుకు వచ్చారు.
ముందుగా హరి సింగ్ ప్రాజెక్టులో దిగుతుండగా జారి నీట మునిగాడు. ఇది గమనించిన బాల్ సింగ్.. అన్నను కాపాడే క్రమంలో నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో ప్రాజెక్టులో గాలించిఇద్దరి మృతదేహాలను బయటకు తీయించారు. వాటిని పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.