రెండు వారాల వ్యవధిలో అన్నదమ్ములు మృతి చెందడంతో తల్లిదండ్రులకు పుత్ర శోకం మిగిలింది. తమ్ముడి దశదిన కర్మ రోజే అన్నకు గుండెపోటు రావడం వారిని శోక సంద్రంలో ముంచింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిలా తిమ్మాపూర్ మండలం రేణికుంటకు చెందిన ఉమ్మెంతల అరుణ, చంద్రారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు.
పెద్ద కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి(30) ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు మధుకర్‌రెడ్డి(26) హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఆగస్టు 3న మధుకర్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 13న అతడి దశదినకర్మ నిర్వహిస్తుండగా శ్రీకాంత్‌రెడ్డికి గుండెపోటు వచ్చింది.
గమనించిన కుటుంబసభ్యులు హైదరాబాద్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 16న మృతి చెందాడు. రెండు వారాల వ్యవధిలో అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కుమారులు దూరమవడంతో కన్నవారి రోదనలు మిన్నంటాయి.