
నర్సాపూర్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు హత్యలు జరిగాయి. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి శివారులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నర్సాపూర్ ఎస్సై శివకుమార్ కథనం మేరకు గ్రామానికి చెందిన చందగోని వెంకటేశం గౌడ్ పొలాన్ని శివన్నగారి సత్యనారాయణగౌడ్ లీజు తీసుకొని ఇటుకలు తయారు చేస్తున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కౌందర్ తాలూకా ముసల్గా గ్రామానికి చెందిన ప్రకాశ్ మాధవ్ శార్వాడే(42), తన భార్య, ముగ్గురు కుమారులు ఇటుక బట్టీ వద్ద రేకుల షెడ్డు వేసుకొని పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ప్రకాశ్ మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని ఇటుక బట్టీ యజమాని సత్యనారాయణగౌడ్‌కు అక్కడే పనిచేస్తున్న గజానన్ ఫోన్ చేశాడు. గొడవ విషయం చెప్పాడు. బుధవారం ఉదయం ఇటుక బట్టీ వద్దకు వెళ్లగా రేకుల షెడ్ వద్ద రక్తపు మడుగులో ప్రకాశ్ మాధవ్ శార్వాడే చనిపోయి ఉన్నాడు. కుటుంబ సభ్యులు కలిసి అతని కొట్టి చంపారని అనుమానంతో నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.
జహీరాబాద్‌లో స్వీపర్
జహీరాబాద్: జహీరాబాద్‌లోని రంజోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చ ంపారు. జహీరాబాద్ సీఐ రాజు, రూరల్ ఎస్సై ప్రసాద్ రావు కథనం మేరకు రంజోల్ గ్రామానికి చెందిన ఎరుకల జర్నప్ప (43) పాలిటెక్నిక్ కాలేజీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళుతున్న క్రమంలో జర్నప్పపై దుండగులు కర్రలతో దాడి చేసి చంపేశారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.