ఆర్మూర్, వెలుగు: పదిహేను రోజులక్రితం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వద్ద నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోంచి చైన్ ఎత్తుకెళ్ళిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసి 75 గ్రాముల బంగారం, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మూర్ ఏసీపీ జి.వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జల్సాలకు అలవాటు పడిన ఆర్మూర్‌కు చెందిన బట్టు బాల్‌రాజ్ మైనర్ బాలునితో కలిసి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని అన్నారు.
పదిహేను రోజుల క్రితం మామిడిపల్లి వద్ద రుకాంబాయి మెడలోంచి చైన్ లాక్కుని పారిపోయారని, శనివారం రాత్రి పాతబస్టాండ్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారని తెలిపారు. చోరీ చేసిన బంగారం కొనుగోలు చేసిన నూనె గంగాధర్ ను పట్టుకుని ఆయన నుండి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఐ సత్యనారాయణగౌడ్ పర్యవేక్షణలో ఎస్ఐలు గోవింద్, మహేష్, ఐడి పార్టీ పోలీసులు నిందితులను పట్టుకున్నారని వారిని ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.