- భార్యను చంపి జైలుకు..
- బిడ్డ సాక్ష్యంతో 14 ఏండ్లు జైలుకు
- సత్ర్పవర్తనతో విడుదల
- చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగిన పిల్లలు
- చూసుకుంటానని చేరదీసి హైదరాబాద్కు పరారైన తండ్రి
జమ్మికుంట, వెలుగు : ‘ఓ నాన్నా.. నీ మనసే వెన్న..అమృతం కన్నా అది ఎంతో మిన్న’ అని ఓ సినిమాలో తండ్రి గొప్పతనం గురించి పిల్లలు పాడే పాట ఆ తండ్రిపై ఉండే ప్రేమను గుర్తు చేస్తుంది. కానీ, కరీంనగర్ జిల్లాలో ఓ తండ్రి వ్యవహారం దీనికి విరుద్ధంగా ఉంది. భార్యను చంపి జీవితఖైదు అనుభవించి వచ్చిన ఓ తండ్రి తన పిల్లలను దగ్గరకు తీసుకున్నట్టే తీసుకుని మళ్లీ వారిని అనాథలను చేసి పారిపోయాడు.. దీంతో చిన్నప్పటి నుంచి వారి ఆలనా పాలన చూసిన ఆశ్రమ నిర్వాహకులే మళ్లీ అక్కున చేర్చుకున్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వరపల్లికి చెందిన సోమ సారయ్య, సత్తమ్మలకు పూజ, బన్నీ పిల్లలు. కుటుంబకలహాలతో సత్తమ్మను 2010లో సారయ్య హత్య చేశాడు. దీన్ని ప్రత్యక్షంగా చూసిన బిడ్డ పూజ(అప్పుడు 5 ఏండ్లు) కోర్టులో సాక్ష్యం చెప్పడంతో సారయ్యకు జీవిత ఖైదు పడింది. అనాథలైన పూజతోపాటు బన్నీని అప్పటి సీఐ సుందరగిరి శ్రీనివాసరావు చేరదీసి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాథాశ్రమ నిర్వాహకుడు గోపగాని వీరస్వామికి అప్పగించాడు. అప్పటి నుంచి వారి ఆలనా పాలనా వారే చూసుకుంటూ పెంచి పెద్ద చేశారు. ప్రస్తుతం పూజ డిగ్రీ, బన్నీ ఇంటర్ చదువుతున్నాడు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఈనెల 3న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా అందులో సారయ్య కూడా ఉన్నాడు.
బయటకు వచ్చాక పిల్లలు అనాథాశ్రమంలో ఉన్నారని తెలుసుకుని వెళ్లి వారిని కలుసుకున్నాడు. ‘నేను మారిపోయా, చేసిన దానికి పశ్చాతపడుతున్నా, ఇంతకాలం మీరు అనాథలుగా బతికింది చాలు. ఇక నుంచి మీ బాగోగులు చూసుకుంటా’ అని జమ్మికుంట–శ్రీరాములపల్లి మధ్య ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో పిల్లలను ఉంచాడు. రెండు రోజులు సరిగ్గానే ఉన్నా మూడో రోజు హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ఫోన్ చేశాడు. ‘మీరు నాకు పుట్టలేదు. నా పిల్లలే కాదు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. మీ సర్టిఫికెట్లో కూడా నా పేరు ఉండకూడదు’ అంటూ ఫోన్ పెట్టేశాడు. దీంతో వారు బోరున విలపిస్తూ మళ్లీ అనాథాశ్రమానికి వెళ్లిపోయారు. చిన్నప్పటి నుంచి వారిని పెంచిన నిర్వాహకుడు వీరస్వామి మళ్లీ అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటాడు.