పొలంలోని గోతుల్లో మునిగి .. ఇద్దరు చిన్నారులు మృతి

  • మట్టి తవ్వకాలతో ఏర్పడ్డ గుంతలు  
  • బాతు పిల్లలను ఆడించేందుకు నీళ్లలోకి దిగగా ప్రమాదం
  • ఖమ్మం జిల్లా కాకర్లపల్లిలో విషాదం

సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామంలో ఇద్దరు పిల్లలు ఆడుకునేందుకు బాతు పిల్లలను తీసుకుని ఇంటి సమీపంలోని పొలంలోకి వెళ్లగా, గ్రావెల్ కోసం తీసిన గుంతలో పడి చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని కాకర్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఇస్రం శ్రీను, గంగా దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు వికాస్(9) 5వ తరగతి చదువుతున్నాడు. అదే కాలనీకి చెందిన కోలా మహేశ్, నాగమణికి ఇద్దరు కొడుకులున్నారు. వీరి పెద్ద కొడుకు సిద్దార్థ (12) 7వ తరగతి చదువుతున్నాడు. వికాస్, సిద్దార్థ కలిసి ఆదివారం తమ బాతు పిల్లలను ఆడించేందుకు సమీపంలోని పొలానికి వెళ్లారు.

కొంతకాలం కింద గ్రామస్తులు మట్టి కోసం పొలంలో తవ్వారు. దీంతో గుంతలు ఏర్పడ్డాయి.  సమీపంలోని ఒక బోరు నుంచి వచ్చిన నీళ్లు చేరడంతో పొలం నిండిపోయింది. ఈ నీళ్లలో బాతు పిల్లలను ఆడించేందుకు వచ్చిన పిల్లలు దిగారు. వీరితో పాటు మరో పిల్లాడు కూడా వచ్చి కొంతదూరంలో ఉన్నాడు. అయితే, పిల్లలిద్దరూ గుంతల్లో మునిగిపోయారు. ఎంతకూ పైకి రాకపోవడంతో దగ్గర్లో ఉన్న పిల్లవాడు పరిగెత్తుకు వెళ్లి కుటుంబసభ్యులు, గ్రామస్తులకు చెప్పాడు. వారు వచ్చి చూడగా పొలంలోని గుంతల్లో  ఇరుక్కున్న పిల్లలు కనిపించారు. వారిని పైకి తీసి సత్తుపల్లి ఏరియా దవాఖానకు తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయారని డాక్టర్లు తెలిపారు. సీఐ మోహన్ బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.