అర్హుల జాబితాలో పేర్లు లేవని సెల్​ టవర్​ ఎక్కిన ఇద్దరు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇండ్ల స్థలాల లబ్ధిదారుల ఫైనల్​లిస్టులో తమ పేర్లు తొలగించారని ఆరోపిస్తూ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇద్దరు సెల్ టవర్​ఎక్కారు. చుంచుపల్లి మండలంలోని మాయాబజార్, వనమానగర్, ఎస్ఆర్టీ నగర్ త్వరలో సింగరేణి వీకే-–7 ఓసీలో కలవనున్నాయి. ఈ మూడు ప్రాంతాల్లోని నిర్వాసితులకు సింగరేణి హెడ్డాఫీస్​సమీపంలో ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం పంచాయతీ ఆఫీసు వద్ద లబ్ధిదారుల పేర్లు ప్రకటించగా, మాయాబజార్ ​ప్రాంతానికి చెందిన బన్ను, శివ అనే ఇద్దరు తమ పేర్లు లేవని మనస్తాపం చెందారు.

సోమవారం ఉదయం రుద్రంపూర్​లో సెల్ టవర్​ఎక్కి నిరసనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకు పై నుంచి దిగమని భీష్మించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ, కాంగ్రెస్​లీడర్​పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అక్కడికి చేరుకున్నారు. బాధితులతో ఫోన్​లో మాట్లాడి సర్దిచెప్పారు. అర్హుల పేర్లు తొలగించడం అన్యాయమంటూ ఆర్డీఓతో మాట్లాడారు. అర్హులందరికీ స్థలాలు ఇవ్వకుంటే పంపిణీని అడ్డుకుంటామని హెచ్చరించారు. బీఎస్పీ స్టేట్ జనరల్​సెక్రెటరీ యెర్రా కామేశ్​బాధితులతో మాట్లాడారు. బీఆర్ఎస్, టీబీజీకేఎస్​నేతల ఒత్తిడితో అనర్హులను చేర్చి, నిర్వాసితులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. చివరికి పొంగులేటి హామీతో నిరసనకారులు టవర్​దిగారు. అయితే సోమవారం రాత్రి ఎస్ఆర్టీ నగర్ కు చెందిన రవితేజ అనే వ్యక్తి టవర్​ఎక్కి హల్​చల్ చేశాడు. స్థానికులే అతన్ని కిందికి దింపారు.